పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/113

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తోడినరునిపట్ల పగా వైరమూ పెట్టుకొని దేవుణ్ణి పూజిస్తే ఆపూజ చెల్లదు. కనుక దేవుణ్ణి ఆరాధించడం కంటె గూడ సోదరప్రేమను పాటించడం లెస్స. మరి యింత విలువైన ఈ సోదరప్రేమను మనం అనాదరం చేయవచ్చా?

9. నా సోదరులకు చేస్తే నాకు చేసినట్లే - మత్త 25,40

తోడిజనాన్ని పరామర్శిస్తే ప్రభువుని పరామర్శించినట్లే, దీనులకు అన్నంబెట్టి బట్టలిచ్చి మందులిచ్చి ఆదరిస్తే ప్రభువు తన్ను ఆదరించినట్లే భావిస్తాడు. ఎందుకు? భగవంతుడు నరుణ్ణి తనకు పోలికగా చేసాడు. ప్రతినరుని ముఖంలోను దేవుని పోలిక వుంటుంది - ఆది 1,27. ప్రతి నరునిలోను, విశేషంగా దీనుల్లో, అతడు నెలకొని వుంటాడు. దేవుణ్ణి మనం కంటితో చూడలేం. కాని ఆ దేవునికి గుర్తుగా వున్న నరుడ్డి మాత్రం ఇరవైనాలుగంటలూ చూస్తూనే వుంటాం. కనుక ఆ దేవునికి చేయగోరింది తోడిజనానికి చేస్తే చాలు. ప్రభువు ఆ వుపకారాన్ని తనకు చేసినట్లే భావిస్తాడు. కనుకనే అతడు మిూరు నా సోదరులకు చేసిన మేలు నాకు చేసినట్లే ఎంచుతాను అన్నాడు.

మదర్ తెరీసాలాంటి మాన్యులు అనాథులకు సేవలు చేస్తుంది ఎందుకు? వాళ్ళల్లో ఆ ప్రభువుని చూచే, ఆ సేవలు ప్రభువుకి చెందుతాయన్న భావంతోనే. ఈ దృష్టితోనే మనం కూడ దరిద్రులకూ దౌర్భాగ్యలకూ సేవలు చేయాలి. అప్పడే కాని మనం సోదర ప్రేమను పాటించినట్లు కాదు.

10. డెబ్బెయేడుసార్లు క్షమించాలి - మత్త 1821-22

పూర్వవేదంలో లెమెక్ అనేవాడు శత్రువు విూద డెబ్బెయేడంతలు పగతీర్చుకోగోరాడు = ఆది 4,24. కాని నూత్నవేదంలో ఇది పద్ధతి కాదు. అందుకే శత్రువులను ఏడుపర్యాయాలు క్షమిస్తే చాలా అని పేత్రు అడగ్గా క్రీస్తు డెబ్బెయేడు పర్యాయాలు క్షమించాలని చెప్పాడు. లెమెక్ 77 రెట్ల పగతీర్చుకొంటే శిష్యులు 77రెట్ల క్షమించాలి. అతని పగకు మన క్షమాగుణం విరుగుడు కావాలి. ఇక్కడ 77 సార్లంటే చాలసార్లు, లెక్కలేనన్ని సారు అని భావం, అనగా శత్రువులను ఎన్నిసార్లయినా క్షమిస్తుండవలసిందేనని అర్థం.

మామూలుగా మనకు శత్రువులను క్షమించబుద్ధి పట్టదు. వాళ్ళమిూద పగ తీర్చుకోకపోతే మగతనమేమంది అనుకొంటాం. కాని పగతీర్చుకొన్నవాడు కాదు, క్షమించినవాడు ఘనుడు. వాడే సోదరప్రేమను పాటించినవాడు. ఈ సందర్భంలో తెలుగు కవి వేమన ఈలా చెప్పాడు :