పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/108

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అతడు మంచివాళ్ళకు మాత్రమే కాదు చెడ్డవాళ్ళకు కూడ తన సూర్యరశ్మిని దయచేస్తాడు. సజ్జనులకు దుర్జనులకు కూడ వరాన్ని సమానంగా కురిపిస్తాడు. వాన మంచివాళ్ళ పొలంమిూద మాత్రమే కురిసి చెడ్డవాళ్ళ పొలంమీద ఆగిపోదుకదా! ఆ తండ్రిని ఆదర్శంగా పెట్టుకొని మనం కూడ మంచివాళ్ల చెడ్డవాళ్లు అనే విచక్షణ లేకుండ అందరిని ప్రేమించాలి.


పిల్లలు తల్లిదండ్రుల్లాగ వుండాలి కదా! మన తండ్రియైన దేవుడు కరుణామయుడు. అతడు సులభంగా కోపపడేవాడు కాదు. నిత్యము ప్రేమ చూపేవాడు - నిర్గ 34,6. ఆ తండ్రిపోలిక మనలో వుండాలంటే మనం కూడ కరుణామయులమూ ప్రేమ హృదయులమూ కావాలలి.


తమ మిత్రులనూ బంధువులనూ ప్రేమించడంలో గొప్పయేమిూ లేదు. అన్యమతస్థలూ పాపులూ కూడ ఈలా చేస్తూనే వున్నారు కదా? మరి మన ప్రత్యేకత యేమిటి? కనుక దేవుని బిడ్డలు వాళ్లవీళ్ళ అనే విచక్షణ లేకుండ అందరిని అంగీకరించాలి. పరలోకంలోని తమ తండ్రిలాగే తామూ పరిపూర్డులు కావాలి. ఈ పరిపూర్ణత్వం దేనిలో? అందరియెడల దయచూపి అందరిని ప్రేమించడంలో, ఆ తండ్రి పాపాత్ముల కొరకు తన కుమారుణ్ణి అనుగ్రహించాడు - మార్కు 12,1-12 ఈలాగే మనమూ దుష్టులను కూడ అంగీకరించాలి. అప్పడు గాని మనం కూడ ఆ తండ్రిలాగే పరిపూరులం కాము. ఫలితార్థమేమిటంటే, మనమూ ఆ తండ్రిలాగే అందరినీ ప్రేమించగలిగి వుండాలి.


కొందరు భగవంతుని ప్రమేయం లేకుండానే తోడి జనాన్ని ఆదరిస్తూంటారు. నాస్తికులు కూడ తోడివారిని ప్రేమించవచ్చు. కాని క్రైస్తవుల సోదరప్రేమ ఈలాంటిది కాదు. మనం భగవంతుని కొరకు తోడిజనాన్ని ప్రేమించాలి. భగవంతుడు మన ప్రేమలో ప్రవేశించినపుడే దానికి విలువ వుండేది.


2. అన్ని ఆజ్ఞలూ ప్రేమ విూదనే ఆధారపడతాయి - మత్త 22,34-40


ఓమారు ఓధర్మశాస్త్ర బోధకుడు క్రీస్తుని పరీక్షింపగోరి అన్నిటికంటె గొప్పయాజ్ఞ ఏది అని ప్రశ్నించాడు. ఆ సందర్భంలో ప్రభువు పూర్వవేదం నుండి ప్రేమాజ్ఞను ఉదాహరించాడు. ప్రభువుని పూర్ణహృదయంతో, పూర్ణ మనస్సుతో, పూర్ణశక్తితో ప్రేమించాలి అంటుంది ద్వితీయోపదేశకాండం - 6,5, ఈ వాక్యంలో మూడుసార్లు పూర్ణశబ్దం విన్పిస్తుంది. అనగా ఆ దేవుణ్ణి అరకొరలుగాగాక పరిపూర్ణంగా ప్రేమించాలని భావం.


ఈ వాక్యం తర్వాత క్రీస్తు లేవీయకాండం నుండి "నిన్ను వలె నీపొరుగువానిని గూడ ప్రేమించు" అనే వాక్యం ఉదాహరించాడు - 19,18. ఇక్కడ క్రీస్తు పేర్కొన్న ప్రేమాజ్ఞలో రెండు భాగాలున్నాయి. మొదటిది దైవప్రేమ, రెండవది సోదరప్రేమ.