పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/104

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

భగవంతుణ్ణి నమ్మి ఆ ప్రభువు ఏలాగైనా తనకు సహాయపడతాడని భావిస్తాడు. ఇతరులు తనకు తీరని వ్యధ తెచ్చిపెట్టినపుడుకూడ తాను ఆ బాధలను సహిస్తాడు. అన్ని కష్టాలనూ భరించేగుణం ప్రేమలోవుంది.

మూడవభాగ

సోదరప్రేమ శాశ్వతమైంది - 13, 8-13

ప్రేమ శాశ్వతంగా నిలుస్తుంది. ప్రవచనంలాంటి కృపావరాలు నశిస్తాయికాని ప్రేమ నశించదు. అది యిూలోకంలో లాగే పరలోకంలో కూడ వుంటుంది. ఇక్కడ అపరిపూర్ణంగా వుంటుంది, అక్కడ పరిపూర్ణంగా వుంటుంది - అంతే భేదం, ఇక్కడ దేవుణ్ణి పరోక్షంగా దర్శిస్తాం. ఆదర్శనం అద్దంలోని బొమ్మ మసకగా కన్పించినట్లుగా వుంటుంది. కాని అక్కడ దేవుణ్ణి ప్రత్యక్షంగా దర్శిస్తాం. ఆ దర్శనం వ్యక్తిని ముఖాముఖి చూచినట్లుగా వుంటుంది. ఈలాంటి వ్యత్యాసాలు కొన్ని వున్నా ఇక్కడి ప్రేమే మోక్షంలో కూడ వుండేది.


ఆ మోక్షంలో ప్రభువుకి మనపట్ల గల ప్రేమ పరిపూర్ణమౌతుంది. ఆ పరిపూర్ణ ప్రేమ ద్వారా మనం కూడ అతన్ని పూర్ణంగా ప్రేమిస్తాం.


ఇక్కడ మనం దేవుణ్ణి చూడకుండనే విశ్వసిస్తాం. కాని స్వర్గంలో దేవుణ్ణి యథార్థంగా చూస్తాం. కనుక ఇక్కడి విశ్వాసం అక్కడ అవసరంలేదు, వుండదుకూడ. ఈ విశ్వాస ఫలితం మాత్రమే అక్కడ వుంటుంది. ఆలాగే ఈ లోకంలో దేవుడు మనకు మోక్షం దయచేస్తాడని నిరీక్షిస్తాం, ఆలోకంలో మనకు మోక్షం యథార్థంగా లభిస్తుంది. కనుక ಇತ್ಯಾದಿ నిరీక్షణం అక్కడ అవసరం లేదు. ఈ నిరీక్షణం ఫలితం మాత్రం అక్కడ వుంటుంది.


ఇక ప్రేమసంగతి అలా కాదు. మనం ఇక్కడా అక్కడాగూడ ప్రేమించవలసిందే. కనుక ఇక్కడి ప్రేమె అక్కడకూడ వుంటుంది. అక్కడ అది పరిపూర్ణమౌతుందేగాని తగ్గిపోదు. కనుక ప్రేమ శాశ్వతమైంది. విశ్వాసనిరీక్షణలకు ఈ శాశ్వతత్వంలేదు. ప్రవచనాది కృపావరాలకు శాశ్వతత్వం అసలేలేదు. కనుక అన్నిటికంటే ప్రేమ శ్రేష్టమైంది. అందుకే బుద్ధిమంతుడు అన్నిటికంటే దీన్ని ఘనంగా యెంచాలి. అన్నిటికంటే అధికంగా దీన్ని సాధించాలి.


ఉపసంహారం


ముందటి అధ్యాయాల్లో సోదర ప్రేమను గూర్చి ఆయా అంశాలు విచారించి చూచాం. కట్టకడన ముగింపు వాక్యాలుగా ఈ యూరంశాలను గుర్తిద్దాం.