పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/98

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఊహించమంటుంది — 9,12-14. పూర్వనిబంధనం ద్వారా యిస్రాయేలీయులు యావే ప్రజలయ్యారు. అతడూ వాళ్ళకు దేవుడయ్యాడు. నూత్న నిబంధనంద్వారా మనం క్రీస్తు ప్రజలమౌతాం. అతడు మనకు దేవుడౌతాడు - ప్రకట 21,3. “అతడు వారి దేవుడు. వాళ్ళు అతని ప్రజలు" అనే పల్కులను బైబులు నిబంధన సందర్భంలో వాడుతుంది.

6. ఎడారి

యిస్రాయేలీయులు నలువదియేండ్లు ఎడారిలో ప్రయాణం చేసిన పిదపగాని వాగ్దత్తభూమిని చేరుకోలేదు. ఐగుప్తునుండి వెడలివచ్చిన మొదటితరంవాళ్ళంతా ఆ యెడారిలోనే గతించారు. హీబ్రూప్రజల సంప్రదాయంప్రకారం ఎడారి దేవుణ్ణి కలసికొనే తావు. మోషే యేలీయా మొదలైన మహాభక్తులంతా ఎడారిలో దైవసాక్షాత్కారం పొందారు. ఇంకా యెడారి నరుడు దేవుణ్ణి పరీక్షకు గురిచేసే తావకూడ. ఎడారిలో యిప్రాయేలీయులు దేవుణ్ణి నమ్మలేదు. అతనికి పరీక్షలు పెట్టారు. నూత్నవేదంలో క్రీస్తు పౌలు మొదలైన వాళ్ళు కొంతకాలం ఎడారిలో గడిపారు. కనుక ఎడారి బైబుల్లో ఓ పెద్ద భావం. ప్రస్తుతాధ్యాయంలో ఈ యంశాన్ని గూర్చిన వివరాలను కొన్నిటిని తెలిసికొందాం. బైబులు ఎడారి మన యెడారిలాంటిది కాదు. అది పైరుపంటలు పండని అడవినేల. నిర్జనప్రదేశం. మరుభూమిమాత్రం కాదు.

1. మన్నా

ప్రజలు సీనాయి ఎడారిలో ప్రయాణం చేస్తున్నారు. అక్కడ వాళ్ళకు తిండి దొరకలేదు. కనుక ఆ జనం మేము ఐగుప్తులోనే చనిపోయి వుంటే బాగుండేదని మోషేమీద సణుగుకొన్నారు. అతడు యావేకు మొరపెట్టగా ప్రభువు యిస్రాయేలీయులకు ఆకాశంనుండి అద్భుతంగా ఆహారం కురిపించాడు. అదే మన్నా - నిర్గ 16,12-16. ఇది ఉదయం నేలమీద పొగమంచులా కురిసేది. తెల్లగా కొత్తిమిరగింజ ఆకారంలో వుండేది. తేనెలా తీయగా వుండేది. ప్రజలు రోజూ దాన్ని ఏరుకొని తినేవాళ్లు - 16,31. ఈ భోజనం ఎవరికి ఇష్టమైన రుచి వాళ్ళకు కలిగించేది - జ్ఞాన 16,20-21. ఈలా యెడారిలో ఈ యన్నం కురియడం పూర్వవేదంలో ఓ గొప్ప అద్భుతం. ఐనా యిప్రాయేలీయులు ఈ భోజనాన్ని చూచి విసుగుకొన్నారు. సయ్యీసారములేని యీ తిండి ఎవడికి కావాలి అని మోషేమీద తిరగబడ్డారు - సంఖ్యా 21, 5. ఔను మరి, భగవంతునిమీద విశ్వాసంలేనివాళ్ళకు అతని అద్భుతాలు కూడ అద్భుతాలుగా కన్పించవు.