పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/83

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది



4. చలనాత్మకంగా వుండేవాడు

నిర్గమ 12, 12లో యావే మోషేతో "నేను ఐగుప్తు దేశంలో సంచరిస్తాను" అంటాడు. 33,22లో యావే మోషేకుముందుగా సాగిపోతాడు. 34,6లో అతడు మోషేకు ముందుగా దాటివేళ్తూ తననామాన్ని ప్రకటిస్తాడు. ఈ సందర్భాలన్నీ యావే కదలికలను వర్ణిస్తాయి. కనుక అతడు చలనాత్మకమైన దేవుడు. క్రియాపరుడు, తన ప్రజలకొరకు కృషిచేసేవాడు. అతని కృషే రక్షణం.

నాటి కనానీయులు, ఫిలిస్తీయులు వాళ్ళదేవుళ్ళ విగ్రహాలను మోసికొనిపోయారు. ఆ భక్తులు లేకుంటే ఆదేవుళ్ళకూడ లేరు. కాని యావే అలాకాదు. అతన్ని ప్రజలు మోసికొని పోరుగదా, అతడే తన ప్రజలను మోసికొనిపోతాడు. అందుకే యెషయా ప్రవచనంలో ప్రభువు యిస్రాయేలు నుద్దేశించి "మీరు గర్భంలో ఏర్పడినది మొదలుకొని నాచేత భరింపబడినవాళ్లు, ముదిమి వచ్చిందాక, తలవెండ్రుకలు నరసిందాక, మిమ్ము ఎత్తుకొనేవాడను నేనే" అంటాడు (యెషయా 46, 3–4). ఈ మోసికోవడమే, ఈ ఎత్తుకోవడమే రక్షించడం. ఫలితార్థ మేమిటంటే, యావే యిస్రాయేలును రక్షించేవాడు. అతని అస్తిత్వం రక్షణాత్మకమైంది.

5. క్రీస్తు ఉండేవాడు

ఇక నూతన వేదంలో మన రక్షాణాత్మకమైన అస్తిత్వం క్రీస్తే, కనుకనే అతడు "నేను ఉండేవాడను" అంటాడు (యోహాను 18, 4-8). అనగా యావే పూర్వవేద ప్రజలతో ఉండినలాగే క్రీస్తు నూతనవేద ప్రజలతో నెలకొని ఉండేవాడు. అతడు మన ఇమ్మానువేలు (మత్త 1,22),

6. యావే - యెహోవా

పూర్వ హీబ్రూ లిఖిత ప్రతుల్లో వాడబడిన హీబ్రూ లిపిలో హల్లులేగాని అచ్చులు ఉండేవికావు, దేవునిపేరు ఆ ప్రతుల్లో “య్ హ్ వ్? అని వ్రాయబడివుండేది. ఈ పేరును హీబ్రూ ప్రజలు అసలు ఉచ్చరించేవాళ్ళే కాదు. దానికి మారుగా "అదొనాయి" అని ఉచ్చరించేవాళ్లు అన్నాం. కాని అసలుదాన్ని ఉచ్చరించేటపుడు ఏలా వుచ్చరించేవాల్లో ఎవ్వరికీ తెలియదు. యెహోవా అని ఉచ్చరించేవాళు కాబోలు అనుకొని ప్రాచీన అనువాదాలు 'యెహోవా? లేక “జెహోవా? అని అనువదించాయి. ప్రోటస్టెంటు తెలుగు బైబులు కూడ ఈలాగే అనువదించింది. కాని ఇటీవలి పరిశోధనలవల్ల యూదులు దేవుని పేరు ఉచ్చరించేటపుడు “యాహ్వే” అని ఉచ్చరించేవాళ్లని తెలియవచ్చింది. కనుక నేటి బైబులు విద్వాంసులంతా ఈ పేరును “యాహ్వే' లేక 'యావే" అని ఉచ్చరిస్తారు. కనుక మనంకూడ 'యావే" అని ఉచ్చరించడం. సమంజసం.