పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/82

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాని దేవుని ఉనికి అలాకాదు. హీబ్రూ సంప్రదాయంప్రకారం పేర్లు వ్యక్తిని వర్ణిస్తాయి. కనుక దేవుని పేరుకూడ అతని వ్యక్తిత్వాన్ని వర్ణించాలి. యావే అంటే ఉండేవాడు అన్నాం. ఎలా వుండడం? నిద్రాణంగా కాదు. శక్తిమంతంగా ఉండడం. క్రియాత్మకంగా, రక్షణాత్మకంగా ఉండడం. కనుక యావే అంటే నరుల సన్నిధిలో ప్రత్యక్షమై ఉండేవాడు. నరులకొరకు కృషిచేసేవాడు. నరులను కాచికాపాడేవాడు. నిర్గమ 7:5లో ప్రభువు "ఐగుప్తియులు నేను యావేనని తెలిసికొంటారు" అంటాడు. అవగా ప్రభువు యిస్రాయేలు ప్రజలతో వుండి వాళ్ళను రక్షించేవాడు అని ఐగుప్తుయులు తెలిసికుంటారని భావం. అలాగే 6,6లో కూడ ప్రభువు నేను యావేను అంటాడు. అనగా అతడు యిస్రాయేలు ప్రజలకు ప్రత్యక్షమైవుండేవాడు, శక్తితో వాళ్ళను కాపాడేవాడు అని భావం.

ఈ ప్రభువు క్రియాశక్తి తన ప్రజను రక్షిస్తుంది. ఆ ప్రభువు పథకానికి అడ్డుపడే శత్రుప్రజను శిక్షిస్తుంది. నిర్గమ 3, 14లో ప్రభువు మోషేతో "ఉండేవాడు నన్నుమీయొద్దకు పంపాడు" అని యిశ్రాయేలు ప్రజలకు చెప్పమంటాడు. అనగా రక్షించడానికి శిక్షంచడానికి కూడ సమర్ధుడైయున్నవాడు నన్ను మీ యొద్దకు పంపాడు అని భావం. ఆ ప్రభువు యిస్రాయేలీయులను రక్షించేవాడు. ఐగుప్తీయులను శిక్షించేవాడు.

3. స్వేచ్ఛగా ఉండేవాడు

3, 14లో యావే మోషేతే నేను 'ఏ వున్నవాడనో అతనినే' అంటాడు. ఈ మాటలకు ప్రభువు ఎక్కడ తలంచుకుంటే అక్కడే, ఎప్పడు తలంచుకుంటే అప్పడే, ఎవరికి తలంచుకుంటే వారికే ప్రత్యక్షమై వుంటాడని భావం. యావే స్వేచ్చగా వుండేవాడు. స్వేచ్చగా మెలిగేవాడు. నరులు అతనిని నిర్బంధింపలేరు. 3,13లో మోషే యావే పేరు అడుగుతాడు. హీబ్రూ సంప్రదాయంప్రకారం ఒకవ్యక్తి పేరు తెలిసికొనడమంటే ఆవ్యక్తిని స్వాధీనం చేసికోవడమే. ఈలాగే మానోవా దేవదూత పేరు అడుగుతాడు (న్యాయా 13,17). యాకోబు దేవదూత పేరు అడుగుతాడు (ఆది 32,29), కాని ఈమూడు సందర్భాల్లోను అడుగబడిన వ్యక్తులు తమ పేరులు తెలియజేయలేదు. అనగా యావే నరునికి స్వాధీనం కావడానికి అంగీకరింపరు.

ఫిలిస్తీయులు, కనానీయులు మొదలైన అన్యజాతిప్రజలు దేవాలయాలు పీఠాలు విగ్రహాలు నిర్మించి తాము కొలిచే దేవుణ్ణి వీటిల్లో బంధింపజూచారు. అతనిచే తమ ఇష్టంవచ్చిన పనిచేయించుకోగోరారు. కాని యావే అలా బంధింపబడడు. అతడు స్వేచ్ఛగా మెలిగేవాడు. అందుకే కీర్తన 115, 8 “మా దేవుడు సమస్తము తన ఇష్టం వచ్చినట్లు చేస్తాడు” అంటుంది. యావే విగ్రహాలలాంటివాడు కాడు. అతడు స్వేచ్చగా యిస్రాయేలును ఎన్నుకున్నాడు. స్వేచ్చగానే యిప్రాయేలును రక్షిస్తాడు.