పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/80

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యోసేపు ఈజిప్టులో 110యేండ్లు జీవించాడు. అది నీతిమంతుల ఆయుస్సు, అతడు చనిపోయకముందు సోదరులను ఒక కోరిక కోరాడు. దేవుడు మిమ్ము ఈ దేశంనుండి మళ్లా కనాను మండలానికి తీసికొనిపోతాడు. అప్పడు నా యస్టులను మీ వెంట కొనిపొండి అని చెప్పాడు - 50, 25. దేవుడు పితరులకు ప్రమాణం చేసింది ఈజిప్టు కాదు, కనానుదేశం. ఈజిప్టు వారికి తాత్కాలిక నివాసం మాత్రమే. కనుకనే యోసేపు తన అస్టులను ఆ దేశంలో పాతిపెట్టమని కోరాడు. ఇక్కడ అతడు ఓ ప్రవక్తలా మాట్లాడాడు. తర్వాత మోషేకాలంలో యిస్రాయేలీయులు ఈజిప్టు నుండి వెడలిపోయినపుడు ఆ పుణ్యపురుషుని అస్టులనుగూడ తమవెంట తీసికొని పోయారు - నిర్గ 13,19.

గుణపాఠాలు

యోసేపు కథనుండి మనం నేర్చుకోవలసిన పారాలు చాల వున్నాయి. 1. అతడు దేవుణ్ణి నమ్మినవాడు, దైవభక్తుడు. నానాకష్టాల ద్వారా దేవుడే తన్ను ఈజిప్టుకి కొనివచ్చి అక్కడ ప్రధానమంత్రిని చేసాడని అతని నమ్మకం - 45,7. తనకు ఎదురైన కీడులన్నింటిని దేవుడు మేలుగా మార్చాడని గూడ అతని విశ్వాసం -50, 20. 2. అతడు చాల పరీక్షలకు శ్రమలకు గురయ్యాడు. కాని దేవుడు అతన్ని ఆ కష్టాల నుండి గట్టెక్కించాడు. 3. యోసేపులోని దొడ్డగుణం క్షమాబుద్ధి. అతడు తనకు అపకారం చేసిన అన్నలను క్షమించాడు. ఈజిప్టులోని సారవంతమైన ప్రదేశంలో వారికి వసతి కల్పించాడు. గొడ్డలి తన్ను నరుకుతుంటె గంధపుచెట్టు దానికి సుగంధం పూస్తుంది కదా! 4. అతడు సమర్ధుడైన పాలకుడు. నీతినిజాయితీలు కలవాడు. కరవు కాలంలో స్వదేశీయులు విదేశీయుల అక్కరలు కూడ తీర్చి అందరిప్రాణాలు కాపాడినవాడు.

యోసేపులాగ దైవభక్తిని అలవర్చుకొన్నవాళ్లకు మేలు కలుగుతుంది. వాళ్లకు జీవితంలో కష్టాలు రాకపోవు. కాని ఆ శ్రమలనుండి ప్రభువే వారిని ఒడ్డు జేరుస్తాడు. యోసేపు పదిమందికి ఆదర్శంగా వుండాలన్న తలంపుతోనే బైబులు రచయితలు అతని కథను పెంచివ్రాసారు. మన ప్రజలు ఈ కథను బైబులు నుండి పలుసార్లు పారాయణం చేయడం మంచిది. భక్తుల జీవితాలు మనం కూడ వారి అడుగుజాడల్లో నడచిపోయేలా చేస్తాయి.