పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/79

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సోదరుల బెదరు

యాకోబు చనిపోయాక సోదరులకు బెదరు పుట్టింది. తప్పుచేసినవాళ్ళు ఊరికే వులిక్కిపడతారు వాళ్ళు తాము పూర్వం యోసేపుకి చేసిన అపకారానికి అతడు తమపై పగతీర్చుకొంటాడేమోనని భయపడ్డారు. కనుక వాళ్ళు ఓ కథ అల్లుకొని వచ్చారు. మన తండ్రి చనిపోకముందు నీకీ వర్తమానం తెలియజేయమన్నాడు. “నీ సోదరులు తెలిసో తెలియకో నీకు కీడు చేసారు. నీవు వాళ్లను క్షమించి వదలివేయి.” ఈ మాటలు విని యోసేపు మనసు నొచ్చుకొన్నాడు. అతడు వారితో "మీరు నాకు కీడు తలపెట్టారు. కాని దేవుడు ఆ కీడును మేలుగా మార్చాడు. నన్ను మీకంటె ముందుగా ఇక్కడికి పంపి ఈ కరువు కాలంలో నేను మీ ప్రాణాలనూ, ఇంకా చాలమంది ప్రాణాలనూ నిలబెట్టేలా చేసాడు. కనుక జరిగినదానికి మీరేమీ బాధపడకండి. నేను మిమ్మూ మీ బిడ్డలనూ తప్పక కాపాడతాను" అన్నాడు– 50, 15-21. ఈ పలుకులు ఓ నరమాత్రుడు కాక దేవుడే పలికాడేమో అనిపిస్తుంది.

ఈ కథ సందేశమంతా ఈ చివరి సంఘటనంలో ఇమిడివుంది. ఇతరులు మనకు చెడ్డచేసినా దేవుడు ఆ చెడ్డను మంచిగానే మారుస్తాడు. మన తరఫున మనం దేవుణ్ణి నమ్మి జీవిస్తేచాలు. దేవుణ్ణి నమ్మినవాళ్లకు అన్నీ అనుకూలంగానే జరిగిపోతాయి - రోమా 8,28.

ఇంకా మనకు జరిగే సంఘటనలన్నిటిలోను దేవుని హస్తం వుంటుంది. మొదటలో మనం అతని ప్రమేయాన్ని గుర్తించలేం. కాని క్రమేణ అతని హస్తాన్ని గుర్తిస్తాం. అతని అనుమతి లేందే ఆ సంఘటనం అలా జరిగివుండదని అర్థం చేసికొంటాం. ఆలా అర్థంచేసికొన్న వెంటనే ఆ ప్రభువుకి వందనాలు చెప్పుకోవాలి. యోసేపు చేసింది ఇదే. నూత్న వేదంలో నానా పునీతులు చేసిందికూడయిదే. నేడు మనమూ ఈలాగే చేయాలి.

యోసేపు దొడ్డ గుణాలు కలవాడు. యాకోబు కుటుంబంలో మొదటినుండి అంతఃకలహాలు వున్నాయి. యాకోబుకీ యేసావుకీ పడదు. యాకోబుకీ అతని మేనమామ లాబానుకీ పడదు. అన్నలకూ యోసేపుకీ పడదు. యోసేపు ఇక్కడ ఈ కుటుంబ కలహాలను రూపుమాపాడు. అన్నలను క్షమించి పూర్వవైరాన్ని తొలగించాడు. యాకోబు కుటుంబమంతా ఇక యీజిప్టులో కలసిమెలసి సమాధానంగా జీవించవచ్చు. ఇక వాళ్ల భవిష్యత్తుని వాళ్లే తీర్చిదిద్దుకోవచ్చు. ఈ విధంగా యోసేపు కుటుంబశాంతిని పెంపొందించాడు. అది అతనిలోని దివ్యగుణం.