పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/76

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అయ్యేవాడు కాదు. బాల్యం నుండి దేవుని హస్తం తన్ను నడిపిస్తూంది. దైవ సహాయం వల్లనే తానింతటివాడు అయ్యాడు. ఆ ప్రభువుకి తాను ఎల్లవేళలా రుణపడి వుండాలి.

యోసేపు రాజ్యమంతటా తిరిగి చూచి పరిస్థితులను క్షుణ్ణంగా అర్థంచేసికొన్నాడు. రాజకార్యాలను చాకచక్యంగా నిర్వహించాడు. ఈజిప్టు దాని పరిసర దేశాల ప్రజలూ ఏడేండ్లు కరవు కోరల్లో చిక్కుకొని విలవిల్లాడిపోయారు. అతడు కొట్ల తెరపించి తాను ప్రోగుజేయించిన ధాన్యాన్ని ఎల్లరికి అమ్మించాడు. అతని చలవ వల్ల ప్రజలంతా పిడికెడు తిండితిని బ్రతికిపోయారు. అతడు భూసంస్కరణలు కూడ చేయించాడు. కరవులో చిక్కిన రైతులందరు తమ పొలాలను ఫరోకు అమ్మి ధాన్యం కొన్నారు. ఈ రీతిగా ఈజిప్టులోని భూములన్నీరాజు పరమయ్యాయి. ఈజిప్షియులు తమరాజుని దైవావతారంగా భావించారు.

యోసేపు పరిపాలనాదక్షుడు. ప్రజలను న్యాయసమ్మతంగా పరిపాలించడానికి కావలసిన వివేకమూ ఉపాయమూ కలవాడు. ఈ వరం కొరకే తర్వాత సోలోమోను రాజు దేవుణ్ణి ప్రార్థించాడు-1 రాజు 3,9. యోసేపని చూచి యిస్రాయేలు పాలకులు దేశాన్ని దక్షతతో పాలించాలని రచయిత భావం.

సోదరులు మొదటి సారి యోసేపని సందర్శించడం

కనాను దేశంలో కూడ కరవు వచ్చింది. యోసేపు సోదరులు ధాన్యం కొరకు ఈజిప్టుకి వచ్చి అక్కడ అధికారిగా వున్న తమ్మునికి దండంపెట్టారు. అన్నలు అతన్ని గుర్తుపట్టలేదు. తమ్ముడు మాత్రం అన్నలను గుర్తుపట్టాడు. పూర్వం అన్నలు తన్ను బానిసగా అమ్మివేసి ఇప్పటికి పదేండ్లయింది. ఇంత కాలమయ్యాక వాళ్ళు తమ్ముని గుర్తించకపోవడం సహజమే. అతడు అన్నలు తనకు చేసిన ద్రోహానికి వారికి పశ్చాతాపం పుట్టించాలనుకొన్నాడు. ఇందుకు చాలయెత్తులు పన్ని వారిని ఇరుకుల్లో పెట్టాడు. మొదట వారితో పరుషంగా మాటలాడాడు. మీరు గూఢచారులు. మా దేశపు దుర్గాల గుట్టు తెలిసికోవాలని వచ్చారు అన్నాడు. వారిని మూడునాళ్లపాటు చెరలో త్రోయించాడు. వాళ్ళు లబోదిబో మొత్తుకొని తమకుటుంబ పరిస్థితులను తమ్ముని ముందు ఏకరువు పెట్టారు. తమ ముసలితండ్రి యాకోబుని గూర్చి చెప్పారు. తమ కడగొట్టు తమ్ముడు బెన్యామీనును గూర్చి వివరించారు. యోసేపు మీరు చెప్పేది నిజమైతే మీ తమ్ముడు బెన్యామీనుని ఇక్కడకి తీసికొని రండి. అప్పటిదాకా మీలో వొకడు ఇక్కడ చెరలో వుండాలి అన్నాడు. షిమ్యోనుని బంధించి కారాగారంలోవుంచి తతిమ్మా సోదరులను ధాన్యాన్ని తీసికొని వెళ్లమన్నాడు. దానితో అన్నలకు పశ్చాత్తాపం కలిగింది. వాళ్ళు పూర్వం తాము యోసేపకి చేసిన ద్రోహానికి చింతించారు. “మనం పూర్వం తమ్మునికి కీడు చేసాం. ఇప్పడు వాడి ఉసురు