పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/70

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇష్టసేవకుని చేసికొన్నాడు. ఐనా ఆ యింటిలో అతడు బానిసే. ఇతర బానిసలకు మాత్రం నాయకుడు. సైన్యాధికారికి పెద్ద బలగమంది. ఆ బలగానికంతటికి ఈ హీబ్రూ బానిసే పెద్ద అధికారి. ఇంటివిషయాలన్నీ అతనికే వదలివేసాడు. ఆ యింటిలో అతని తర్వాత అతని యంతటివాడు యోసేపు. అతడు దైవబలం కలవాడు. కార్య చతురుడు. నమ్మదగినవాడు. కనుక యజమానుని మన్ననకు పాత్రుడయ్యాడు.

శోధనలో చిక్కుకోవడం

నరునికి వచ్చే శోధనల్లో లైంగిక శోధనలు అతిబలమైనవి. కనుకనే చాలమంది వాటికి లొంగిపోతూంటారు. యోసేపు చక్కని ఆకారం కలవాడు. యావనంలో వున్నవాడు. ఇకనేం యజమానుని భార్య అతనిపై కన్ను వేసింది. ఆమె అతన్ని పాపపు ఊబిలోనికి లాగజూచింది. తా జెడిన కోతి వనమెల్లచెరుస్తుంది కదా! క్రీస్తు పూర్వం 5000 సంవత్సరాల నాటికే ఈజిప్టులో గొప్ప నాగరకత వృద్ధిలోకి వచ్చింది. ఈజిప్షియులు వారి స్త్రీలకు పూర్ణ స్వేచ్ఛనిచ్చారు. ఇది వారిని కొన్నిసార్లు దుష్కార్యాలకు పురికొల్పేది. ఇక్కడ ఈ స్త్రీ పెద్ద హోదాలో వున్న రాజు సైనికాధికారికి భార్య. ఇక ఆమె ఆగడానికి హద్దులుంటాయా?

ఈ సందర్భంలో ఈ శోధనను కొంచెం విపులంగా పరిశీలించిచూడ్డం మంచిది. ఈ ప్రలోభం లక్షణాలను జాగ్రత్తగా గమనించాలి. 1. యోసేపుకి ఈ శోధన తలవని తలంపుగా వచ్చింది. దానికి కర్త అతడుకాదు. ఆమె, అతడు ఓ అనామకుడైన బానిస. ఆమె దేశంలో ఓ గొప్ప అధికారికి భార్య అంత వున్నతపదవిలో వున్న మహిళ అంత క్రింది స్థాయిలో వున్న నరుద్దీ కామిస్తుందని ఎవరు ఊహించగలరు? ఈ శోధనలో చివరిమెట్టు యోసేపు ఊహింపని గడియలో వచ్చింది. అతడు పనిమీద యజమానుని ఇంటిలోనికి పోయాడు. ఆ సమయంలో అక్కడ దాసులెవ్వరూలేరు. అప్పుడు యజమానుని భార్య అతని పైబట్ట పట్టుకొని తనతో శయనింపరమ్మని కోరింది - 39,12. ఇది దిడీలున వచ్చిన శోధన.

2. ఒకసారి ప్రారంభమయ్యాక ఈ శోధనం చాలనాళ్లవరకు కొనసాగింది. ప్రతిదినం ఆమె యోసేపని పాపకార్యానికి పరికొల్పేది. కాని అతడు ఆమె కోరికను నిరాకరించేవాడు — 39,10. అదే శోధన మల్లామల్లా వస్తే చాలమంది నరులు క్రమేణ లొంగిపోతారు. కొండలా నిశ్చలంగా నిల్చేవాళ్ళు ఎంతమంది? కాని యోసేపు దృఢచిత్తుడు. అతని హృదయం భగవంతునిపై లగ్నమైవుంది. కనుక అతడు తుచ్ఛసుఖాలకు లొంగలేదు.

3. యజమానుని భార్య కోర్మెను అంగీకరిస్తే అతనికి చాల లాభాలు కలుగుతాయి. ఆమె ద్వారా అతడు సులువుగా ఉన్నత పదవిని పొందవచ్చు. పేరూ ప్రఖ్యాతులూ