పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

3. స్త్రీ పురుషులనుగా సృజించాడు.

“దేవుడు నరుడ్డి సృజించాడు, అతన్ని స్త్రీ పురుషులనుగా సృజించాడు" అంటాడు రచయిత - 1, 27. దేవుడు నరుడ్డి ఆడదాన్ని గాను, మగవాడ్డిగాను చేసాడు. అంటే లింగాన్ని భగవంతుడే ఉద్దేశించాడు, నిర్ణయించాడు. స్త్రీ పురుషులను భగవంతుడిచ్చిన ఓ గొప్పవరం లింగం. వీళ్లు భగవంతుడు ఉద్దేశించినట్లుగా లైంగిక జీవితాన్ని గడపాలి. దేవుడు నరుడ్డి స్త్రీ పురుషులనుగా జేసి తానుచేసిన పనిని జూచి చాలబాగుంది అనుకొన్నాడు – 1, 31. కనుక లైంగిక జీవితం దానంతట అది యోగ్యమైంది, పవిత్రమైందికూడ. నరుల్లో కొందరు లింగాన్ని లైంగిక క్రియను దివ్యంగా ఎంచి ఆరాధిస్తారు. ఆడు మగ కలసికోవడమే పరమావధి అనుకొంటారు. మరి కొంతమంది లైంగిక క్రియను పశుతుల్యంగా భావించి నిరసిస్తారు. కాని ఇవిరెండూ తప్పడుభావాలే. లింగాన్ని గూర్చి బైబులు బోధించేబోధ ఈరెండు మార్గాలకు మధ్యస్థంగా వుంటుంది. లింగాన్ని భగవంతుడే ఇచ్చాడుకనుక నరుడుదాన్ని వాడుకోవాలి. దానంతట అది దివ్యమైందీ కాదు, నీచమైందీ కాదు. కనుక దాన్ని పూజింపనూగూడదు, నిరసింపనూగూడదు.

4. సంతానాభివృద్ధి.

భగవంతుడు ఆదిదంపతులను దీవించి "మీరు సంతానాన్ని కని వృద్ధిచెందండి" అన్నాడు – 1, 28. దేవుని వాక్కు ఏంచెప్తుందో అది నెరవేరి తీరుతుంది. కనుక స్త్రీ పురుషులు కలుసుకొన్నపుడు సంతానం కలుగుతుంది. భగవంతుడు తొలి మానవులను శూన్యం నుండి సృజించాడు. కాని మాటిమాటికి ఈలా సృజించడు. ఓమారు దేవుడు తొలి మానవులను సృజించాక, మలి మానవులను మానవులే సృజించుకొంటూబోతారు. కనుక బిడ్డలను కన్నపుడు నరులు దేవుని సృష్టితో సహకరిస్తుంటారు. అందుచేత తల్లిదండ్రులు బిడ్డల పుట్టువును ఓ పవిత్ర కార్యంగా భావించాలి.

చావువల్ల భూమి మీది నరులంతా నశిస్తారు. ఇక లోకంలో మనుష్య జాతి మిగలదు. కనుక నరుడు వివాహజీవితం ద్వారా క్రొత్త మానవులను సృజిస్తుండాలి. ఈ విధంగా చావు కలిగించే నష్టాన్ని పుట్టువు పూరిస్తుంటుంది. కాని భగవంతునికి చావు లేదు. అందుకే బైబులు భగవంతునికి లింగం లేదు. అతడు భార్యను స్వీకరించడు, బిడ్డలను కనడు. ఆ మహాత్ముడు ఆడు మగ భేదాలకు గురిగాని ఆత్మస్వరూపుడు. ఉత్తాన జీవితంలో కూడ చావు లేదు. అందుకే మోక్షంలో పెండ్లిచేసికోవడమూ, బిడ్డలను కనడమూ అనే బెడద లేదు - మార్కు 12, 25.