పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది



పేతురు జాబులు రెండు

పేతురు పేరుమీదిగా రెండు జాబులు ప్రచారంలోకి వచ్చాయి. పేతురు భావాలనే విశదీకరిస్తూ అతని శిష్యుడు వీటిని వ్రాసివుండవచ్చు మొదటిది 62 ప్రాంతంలో వెలువడింది. క్రీస్తుని ఆదర్శంగా తీసికొని ఆపదల్లో ధైర్యంగా వుండాలని చెప్తుంది. రెండవది ప్రభువు రెండవరాకడ మొదలైన విషయాలను పేర్కొంటుంది.

యోహాను జాబులు

యోహాను పేరుమీదిగా మూడు జాబులున్నాయి. యోహానుగాని అతని శిష్యులుగాని వీటిని మొదటి శతాబ్దాంతంలో వెలువరించి వుంటారు. వీటిల్లో రెండు మూడు జాబులు ముఖ్యమైనవి కావు. మొదటిజాబు మాత్రం ప్రశస్తమైంది. ఈ లేఖబోధల ప్రకారం దేవుడు ప్రేమమయుడు. దేవుని ప్రేమ క్రీస్తులో దర్శనమిచ్చింది. క్రైస్తవులు ప్రేమజీవితం గడపాలి.

4. దర్శనగ్రంథం

పూర్వవేదంలో దానియేలు గ్రంథం వెలువడినప్పటికే ప్రవచనం అంతరించి దర్శన వాజ్మయం ప్రచారంలోకి వచ్చింది. ప్రవక్తలు చెవితో దైవసందేశం విని నోటితో ప్రకటించారు. కాని దర్శన గ్రంథకర్తలు దర్శనాల్లో దైవసందేశాన్నిగ్రహించి రచనారూపంలో ప్రకటించారు. నూత్న వేదంలోని తుది గ్రంథమైన దర్శనగ్రంథం ఈ దర్శన సాహిత్యానికి చెందింది. ఇది 95 ప్రాంతంలో పట్టింది. సువిశేషకారుడైన యోహాను దీనికి కర్త కావచ్చు, కాకపోవచ్చు కూడ. ఈ గ్రంథం తొలి శతాబ్దంలో వేదహింసలనుభవించే క్రైస్తవులను హెచ్చరించడానికి పుట్టింది. ఇది పూర్వవేదంలో దానియేలు గ్రంథాన్ని అనుకరిస్తుంది. తండ్రి క్రీస్తుద్వారా మనకు అన్నివేదసత్యాలూ తెలియజేసాడు, అన్ని పరలోక భాగ్యాలూ దయచేసాడు. కనుక క్రైస్తవులు అతన్ని నమ్మి జీవించాలి. శ్రమలకు జంకకూడదు. క్రీస్తు మన శ్రమల్లో మనతో వుండి మనలను కాపాడతాడు.

ఈ గ్రంథంలో చాల సంకేతాలు వస్తాయి. వాటిని అర్థం చేసికోవడం కొంచెం కష్టం. ఐనా ఈ పుస్తకం తొలినాటి వేదహింసలకు సంబంధించిందేగాని భవిష్యత్తులో రాబోయే సంగతులను చెప్పేది కాదు. కనుక దీన్ని భవిష్యత్సంఘటనలను సూచించేదాన్నిగా అర్థం చేసికోవడమూ, ఆ పద్ధతిలో దీనిమీద వ్యాఖ్య చెప్పడమూ తప్ప, నూత్న వేదంలోని ఇతర గ్రంథాల్లో లేని క్రొత్తబోధలను వేటినీ ఈ గ్రంథం చెప్పదు. మామూలు బోధలనే దర్శనాల భాషలో చెప్తుంది, విశేషం అంతే. నూత్న వేదంలో దర్శన సాహిత్యానికి చెందిన పుస్తకం ఇదొక్కటే.