పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లేఖలు

నూత్న వేదంలో 21 జాబులున్నాయి. వీనిలో 14 పౌలు వ్రాసినవి. 7 ఇతరులు వ్రాసినవి. నూత్న వేదంలో మొదట వ్రాయబడిన పుస్తకాలు సువిశేషాలు కాదు, ఈ జాబులే. ఈ లేఖలను కూడ రచయితలు నాటి క్రైస్తవ సమాజాల్లోని ఆయా సమస్యలను పురస్కరించుకొని వ్రాసారేకాని, కేవలం క్రైస్తవ సిద్దాంతాలను ప్రతిపాదించడానికి వ్రాయలేదు. ఐనా ఇవి దైవశాస్తాంశాలతో నిండివుంటాయి.

సువిశేషాలు కథల్లాగ వుండి సులువుగా బోధపడతాయి. జాబులు శాస్తాంశాలతో నిండి ఉండడం వల్ల అంత సులువుగా బోధపడవు. కాని వీటిని అర్థం చేసికొంటే క్రైస్తవ వేదసత్యాలు చాల లోతుగా తెలుస్తాయి. ఇక, ఈ జాబులను ఇప్పడు వాటిని బైబుల్లో అమర్చిన క్రమంలోకాక అవి పుట్టిన కాలక్రమ పద్ధతిలో పరిశీలించి చూడ్డం మెరుగు.

తెస్పలోనీయుల జాబులు రెండు

ఇవి నూత్నవేదంలోని పుస్తకాల్లో కెల్ల మొదటి రచనలు. పౌలు వీటిని క్రీ.శ. 50 ప్రాంతంలో వ్రాసాడు. పౌలు తెస్సలోనికలో క్రైస్తవ సమాజాన్ని స్థాపించాక అక్కడ వేదహింసలు ప్రారంభమయ్యాయి. కనుక అతడు తెస్సలోనిక పౌరులను నిలకడతో వుండమని తొలిజాబులో హెచ్చరించాడు. ప్రభువు రెండవరాకడ కొరకు వేచివుండమని కూడ చెప్పాడు. రెండవజాబులో, తెస్సలోనీయులు క్రీస్తు త్వరలోనే వేంచేస్తాడన్న భావంతో పనిపాటలు మానివేయకూడదని హెచ్చరించాడు. విశ్వాసులు సోదరప్రేమతో జీవించాలని బోధించాడు. ఈ జాబుల్లో రెండవ రాకడను గూర్చి పౌలు చెప్పిన విషయాలు నేటికీ ఆసక్తిని కలిగిస్తాయి.

కొరింతీయుల జాబులు రెండు

పౌలు 54 ప్రాంతంలో ఎఫెసు నుండి కొరింతు క్రైస్తవులకు రెండు జాబులు వ్రాసాడు. మొదటి జాబులో వాళ్లు స్థిరవిశ్వాసంతో మెలగాలని హెచ్చరించాడు. క్రైస్తవ సమాజంలో అంతఃకలహాలు అపవిత్రత పనికిరావని చెప్పాడు. ఆయా సమస్యలను గూర్చి అచటి క్రైస్తవులడిగిన ప్రశ్నలకు సమాధానాలు పంపాడు. రెండవ జాబులో తన మీద అపదూరులు మోపే ఇతర బోధకులను ఖండించాడు. యెరూషలేములో కరవు వలన బాధపడే యూదక్రైస్తవులకు సహాయం చేయమని కోరాడు. ఈ రెండు లేఖలూ పౌలుకీ అతని క్రైస్తవులకీ వుండే వ్యక్తిగతమైన సంబంధాలు చాల తెలియజేస్తాయి.