పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఈ ప్రవక్త ప్రభువు అన్యజాతులను గూడ రక్షిస్తాడని బోధించాడు. యోనా కథలో ఆ ప్రవక్త ఊహించనట్లుగా అతని బోధ విని అన్యజాతి నగరమైన నీనివే పరివర్తనం చెందింది. ప్రభువు దాన్ని కాపాడాడు. ఇది యోనాకు నచ్చక దేవునిమీద సుమ్మర్లు పడ్డాడు. అపుడు ప్రభువు తాను అన్యజాతులనుగూడ రక్షించే దేవుణ్ణని తెలియజేసాడు. కనుక ఈ గ్రంథంలో, పూర్వవేదంలో అరుదుగా కన్పించే అన్యజాతి రక్షణం అనే అంశం శిఖరాన్నందుకొంది. నూత్నవేదంలో క్రీస్తు ఈ యోనా కథను పేర్కొన్నాడు.

3. నూత్నవేద గ్రంథాలు

1. సువిశేషాలు

సువిశేషం అనగానే ఇప్పడు మనకు పుస్తకం అనే భావం కలుగుతుంది. కాని తొలిరోజుల్లో ఇవి కేవలం బోధలుగా మాత్రమే వుండేవి. ఈ బోధలే తర్వాత గ్రంథస్థాలయ్యాయి. సువిశేష రచనలో కనీసం మూడు దశలైనా గోచరిస్తాయి. మొదటి దశలో క్రీస్తు సందేశాలూ అతని జీవిత సంఘటనలూ కేవలం మౌఖిక బోధలుగా వుండేవి. పేతురు మొదలైన శిష్యులు కేవలం నోటితోనే ఈ బోధలను విన్పిస్తూ వచ్చారు. ఈ దశలో రచనలు లేవు. రెండవ దశలో కొందరు రచయితలు క్రీస్తు బోధలనూ అతని జీవిత సంఘటనలనూ చిన్నచిన్న రచనలనుగా వ్రాసూ వచ్చారు. ఉదాహరణకు పర్వత ప్రసంగమూ, మంచి సమరయుని సామెతా మొదలైనవి. ఇవి సంపూర్ణ క్రీస్తు చరిత్రలు కావు. మూడవ దశలో భగవత్సేరితులైన నల్లురు రచయితలు ఈ చిన్నచిన్న రచనలను కలిపి సమగ్రమైన క్రీస్తు చరిత్రలను రూపొందించారు. అవే సువిశేషాలు. ఈ రచయితల్లో మొదటివాడు అరమాయిక్ సువిశేషం వ్రాసిన మత్తయి. తర్వాత వచ్చిన మార్కు లూకా ఈ మొదటి రచయితనుండి చాల విషయాలు స్వీకరించారు. నాల్గవ రచయితయైన యోహాను ప్రత్యేక పద్ధతిలో తన సువిశేషం వ్రాసాడు. నేడు మనకు బైబుల్లో సువిశేషాలంత ఉపయోగకరమైన గ్రంథాలు వేరేవి లేవు. క్రైస్తవులు వీటిని భక్తిభావంతో పారాయణం చేసికోవాలి. ఇక, ఒక్కో సువిశేషాన్ని సంగ్రహంగా పరిశీలిద్దాం.

మార్కు

మార్కు పేతురు శిష్యుడు. పేతురు బోధలవల్ల ప్రభావితుడై ఇతడు 60 ప్రాంతంలో సువిశేషం వ్రాసాడు. గ్రీకు భాషలో వెలువడిన మొదటి సువిశేషం ఇదే. మత్తయి అరమాయిక్ భాషలో వ్రాసిన సువిశేషంనుండి ఇతడు చాల విషయాలు స్వీకరించాడు. క్రీస్తు దైవకుమారుడనేది ఇతని సువిశేషంలోని ప్రధానాంశం. మార్కు ఈ గ్రంధాన్ని రోములోని క్రైస్తవుల కోసం వ్రాసాడు.