పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బైబులు గ్రంథాలు

బైబులు భాష్యం - 72

బైబులు అనే మాట “బీబ్లోస్" అనే గ్రీకు పదం నుండి వచ్చింది. ఈ పదానికి పుస్తకం అని అర్థం. అతి శ్రేష్టమైన గ్రంథం కనుక దీన్ని వట్టినే “పుస్తకం" అని వ్యవహరిస్తూ వచ్చారు.

బైబులు ఒక పుస్తకం కాదు, 73 పుస్తకాల గ్రంథాలయం. చాలమంది రచయితలు చాల కాలాల్లో దీన్ని వ్రాసారు. క్రీస్తుపూర్వం 10వ శతాబ్దం నుండి క్రీస్తు తర్వాత మొదటి శతాబ్దం వరకు - అనగా ఇంచుమించు 1100 ఏండ్లపాటు బైబులు రచన కొనసాగుతూ వచ్చింది. కాని ఇంత దీర్ఘకాలంలో జీవిస్తూ వచ్చిన రచయితల నందరినీ ప్రేరేపించి వాళ్ళచేత గ్రంథాలు వ్రాయించింది భగవంతుడే కనుక దీన్ని ఏక గ్రంథంగా గణించారు.

బైబులును పూర్వనూత్న వేదాలుగా విభజించారు. పూర్వవేదం భగవంతుడు మోషేద్వారా యూదులలో చేసికొనిన నిబంధనను గూర్చి చెప్తుంది. దీనిలో తొలి 46 గ్రంథాలున్నాయి. నూత్న వేదం దేవుడు క్రీస్తుద్వారా నరులందరితోను చేసికొన్న నిబంధననుగూర్చి చెప్తుంది. దీనిలో 27 గ్రంథాలున్నాయి.

యూదులూ క్రైస్తవులూ కూడ బైబులు పుస్తకాలను వేరువేరు విధాలుగా విభజిస్తూ వచ్చారు. ఆధునిక పద్ధతిననుసరించి మనం పూర్వవేదాన్ని నాలురకాల గ్రంధాలుగా విభజించవచ్చు. అవి 1. ఆది పంచకం. 2. చారిత్రక గ్రంథాలు. 3. జ్ఞానగ్రంథాలు. 4 ప్రవక్తల గ్రంథాలు. ఈ విభజనం ప్రకారం పూర్వవేద గ్రంథాలు మొత్తం యివి :

1. ఆదిపంచకం = 5

1 ఆదికాండం
2 నిర్గమ కాండం
3 లేవీయ కాండం
4 సంఖ్యాకాండం
5 ద్వితీయోపదేశ కాండం

2. చారిత్రక గ్రంథాలు = 16


6. యోషువా
7. న్యాయాధిపతులు
8. రూతు
9-10 సమూవేలు గ్రంథాలు రెండు