పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వాక్య పఠనం, ఆలోచనం, ప్రార్ధనం అని మూడు మెట్లుంటాయి. మొదటిది, బైబుల్లోని ఓ మంచి ఘట్టాన్ని ఎన్నుకొని జాగ్రత్తగా చదువుకోవాలి. ఉదాహరణకు యోహాను 15, 1-7. రెండవది, ఆ వాక్యాల భావమేమిటా అని నిదానంగా ఆలోచించి చూచుకోవాలి. క్రీస్తుతో ఐక్యమై అతని నుండి వరప్రసాద బలాన్ని పొందడం పై యోహాను వాక్యాల భావం. మూడవది, మనం చదువుకొన్న వేదవాక్యాలను పరస్కరించుకొని భక్తితో ప్రార్ధనం చేసికోవాలి. ఈ ప్రార్ధనం మనవి, పశ్చాత్తాపం, కృతజ్ఞత, ఆరాధనం అనే నానా రూపాల్లో కొనసాగవచ్చు భక్తితో వేదవాక్యం చదువుకొన్నాక ఆత్మే మనచే ప్రార్థన చేయిస్తుంది. తెరచాప పడవనులాగ ఆ యాత్మ ప్రార్థనాజీవితంలో మనలను నడిపిస్తుంది.

ఈ మూడు మెట్ల పద్ధతిలో బైబులును చదువుకొనే భక్తులు అనతి కాలంలోనే విశేష లాభాలు సాధిస్తారు. రోజూ ఓ పావుగంట కాలమైనా ఈ ప్రక్రియకు వినియోగిస్తుండాలి.

5. సప్తసూత్రాలు

బైబులు పఠనంలో ఉపయోగపడే ముఖ్యసూత్రాలు ఏడున్నాయి. వాటిని క్రమంగా పరిశీలిద్దాం.

1. క్రియాశక్తి బైబులు వాక్కులకు ఇతర గ్రంథాల వాక్కులకు లేని గొప్ప క్రియాశక్తి వుంటుంది. యెషయా ప్రవక్త ఈ క్రియాశక్తిని వానతో పోల్చాడు. వాన భూమిని పదును చేసి దానిలో పంటి పండిస్తుంది. అలాగే ప్రభువు వాక్కు కూడ మన హృదయం మీద ఓ వానలా పనిచేస్తుంది. ఆ హృదయం దేవుని చిత్త ప్రకారం నడచుకొనేలా చేస్తుంది - 55, 10-11. కీర్తనకారుడు ఈ క్రియాశక్తిని దీపంతో పోల్చాడు. దీపం మనకు చీకటిలో దారి చూపుతుంది. ఆలాగే దివ్యవాక్కు మనం ఈ జీవితయాత్రలో ఎటు వెళ్ళాలో ఎటు వెళ్ళకూడదో, ఏమిచేయాలో ఏమి చేయకూడదో తెలుపుతుంది - 119, 105. ఈలాంటి వాక్కుని మనం దైనందిన జీవితంలో వాడుకొని చక్కని ఫలితాన్ని పొందుతూండాలి. మన యింటిలో కరెంటు వేయించుకొంటే అది బోలెడన్ని పనులు చేసిపెడుతుంది. ఆలాగే బైబులుని వాడుకొంటే అది మన జీవితంలో బోలెడన్ని ఫలితాలను ఆర్ధించి పెడుతుంది.

2. ఆకలిదప్పులు, అన్నపానీయాలకు ఆకలిదప్పులు గొంటాం, ఆలాగే వాక్యం కొరకు గూడ భక్తుడు ఆకలిదప్పులు కలిగించుకోవాలి. అప్పడే అది మనకు రుచించేది. కూటికీ నీటికీ మల్లె వాక్యానికి గూడ కరవు వస్తుంది అన్నాడు ప్రభువు - ఆమోసు 8, 11-12. ఇది శాపవాక్యం. ఈ శాపానికి మనం గురికాకూడదు. కనుక ఏ ప్రాదూ వాక్యాన్ని చదువుకొంటూండాలి. నరుడు భోజనంతో మాత్రమేగాదు వాక్యంతో గూడ జీవించాలి — మత్త 4,4.