పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది



మాత్రమేకాదు, దివ్యగ్రంథ పఠనంలో కూడ" అన్నాడు జెరోము భక్తుడు, "దివ్యగ్రంథమనే పాత్రం నుండి క్రీస్తుని పానం చేస్తాం” అని నుడివాడు ఆంబ్రోసు భక్తుడు. క్రీస్తు అనుసరణం వ్రాసిన తోమస్ అకెంపిస్ భావాల ప్రకారం, ఈ జీవిత యాత్రలో మనకు భోజనమూ వెలుగూ రెండూ అవసరమే. దివ్య సత్రసాదం ఆ భోజనం, బైబులు ఆ వెలుగు-4, 11,4.

కడన బైబులు వంటబట్టాలంటే ఆత్మ అనుగ్రహం కూడ అత్యవసరం. పూర్వం దివ్యరచయితలను ప్రేరేపించి వాళ్లచే గ్రంథం చెప్పించింది ఆత్మ -2 పేత్రు 1, 21. శిష్యులకు సర్వసత్యాన్ని అనగా క్రీస్తుని, బోధించింది ఆత్మ - యోహా 16,13. నేడు మనకు బైబులు నేర్పించేది కూడ ఆత్మే కనుక తాను వ్రాయించిన గ్రంథంపట్ల ఆసక్తినీ భక్తినీ కలిగించమని విశ్వాసులు ఆ పవిత్రాత్మనే అడుగుకోవాలి. ఆయాత్మని అనుగ్రహం లేందే ఎవరికీ బైబులు వశపడదు.

2. కొన్ని చిక్కులు

చాలమంది పాఠకులు బైబులు పారాయణంపట్ల నిరుత్సాహం కనబరుస్తుంటారు. కొందరు, అది మాకు సరిగా అర్ధంకావడంలేదని చెప్తారు. బైబుల్లో అన్ని విషయాలు మనకు అర్థంకావు, నిజమే. కాని దానిలో మనకు అర్థంకాని విషయాలకంటె అర్థమయ్యే విషయాలే ఎక్కువగా వుంటాయి. అది చాలదా? ఏ విద్య కూడ మనకు మొదటలోనే పూర్తిగా అర్థంకాదుగదా?

మరికొందరు, బైబులు చదువుతుంటే ఆసక్తికరంగా వుండదని సుమ్మర్లు పడతారు. ఈలాంటివాళ్లకు అసలు ఆధ్యాత్మిక విషయాలే రుచించవేమో! బైబుల్లో అన్ని భావాలూ ఆసక్తికరంగా వుండకపోవచ్చు. కాని ఆసక్తిని కలిగించే ఘట్టాలు మాత్రం చాలా వున్నాయి. కనుక మొదటలో పాఠకులు ఆయా భాగాలను ఎన్నుకొని మరీ చదువుతుండాలి,

ఇంకా కొందరు బైబుల్లో మాకు తెలియందేముంది, పూర్వ నూత్నవేద సంఘటనలు ఇంతకుముందే మాకు తెలుసుగదా అంటారు. ఇది పొరపాటు. బైబులు చాల లోతైన పుస్తకం. దాని వాక్యాల భావాలను మనం ఎప్పటికీ పూర్తిగా గ్రహించలేం. మళ్లామల్లా చదివేకొద్దీ దానిలో క్రొత్తభావాలు తగులుతూంటాయి. ఒక్క విషయం. సముద్రాలు పర్వతాలు వనాలు సూర్యోదయాస్తమయాలు మొదలైన ప్రకృతి సౌందర్యాలను ఒకసారి చూచాం గనుక మళ్లా చూడకుండా వుంటామా? ఒక్కసారి చూడ్డంతోనే వాటిల్లోని సౌందర్యాన్నంతటినీ గ్రహించినట్లేనా? రుచిగల భోజనమూ పిండివంటలూ ఒక్కసారి భుజించాం గనుక వాటిని మల్లా భుజించకుండా వుంటామా? ఒక్కసారి భుజించడంతోనే ఆ పదార్థాల్లోని రుచినంతటినీ గ్రహించినట్లేనా? బైబులు పఠనం కూడ ఇంతే.