పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/101

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నిలచి అతని చేతులెత్తి పట్టుకొన్నారు. ప్రొద్దుక్రుంకేవరకు మోషే కొండమీద ఆలాగే ప్రార్ధనచేసాడు. క్రింద యోషువా అమాలెకీయులను కత్తివాదరకు బలిచేసాడు. నిర్గమ 17,8-16. ఇక్కడ మోషే చాచిన చేతులు ప్రవక్త చూపే సూచనక్రియగా భావించుకోవాలి. ప్రవక్త వాక్కులాగే అతని సూచనక్రియగూడ శక్తిమంతంగా పనిచేస్తుంది. ప్రభువు యిస్రాయేలీయులకు విజయం ప్రసాదిస్తాడని ఈ సూచనక్రియ భావం. ఈ పట్టున రబ్బయులు “యిస్రాయేలీయులు కొండమీది మోషేనుచూచి అతన్ని ఆలా చేతులు చాపమని ఆజ్ఞాపించిన యావేను విశ్వసించారు. దానివల్ల వాళ్ళకు విజయం సిద్ధించింది" అని వ్యాఖ్యానించారు.

ఇక్కడ ఆవైపున ఒకడు ఈవైపున ఒకడు నిలబడగా మధ్యలో మోషే జెండాలుగా నిలబడ్డాడు. తాను ధ్వజంలాగ నిలుచుండి యావే విజయాన్ని ప్రకటించాడు - నిర్గమ 17, 12. ఆలాగే క్రీస్తుకూడ ఆవైపున ఒక దొంగ ఈ వైపున ఒక దొంగనిలువగా వారి మధ్యలో తాను జెండాలాగ నిలిచాడు. ధ్వజంలాగ సిలువమీద నిలిచి పాపం మీద విజయాన్ని ప్రకటించాడు - యోహా 19,18-19. అనగా ఇక్కడ అహరోను హూరులమధ్య వున్న మోషేకు, ఇద్దరు దొంగల మధ్యవున్న క్రీస్తుకు సామ్యం చెప్పబడింది. ఆ మోషేలాగే క్రీస్తుకూడ ప్రార్ధనచేసి ప్రజలకు రక్షణవిజయాన్ని సంపాదించిపెట్టాడు.

5. యిస్రాయేలు శోధనలు

యిస్రాయేలీయులు ఎడారిలో చాల శోధనలకు గురయ్యారు. క్రీస్తుకూడ బహిరంగజీవితం ప్రారంభించడానికి ముందు ఎడారికి వెళ్ళి శోధనలకు గురయ్యాడు. ఎడారిలో అతడు ఎదుర్కొనిన మూడు శోధనలకూ యిస్రాయేలీయుల శోధనలకూ ఎంతో సామ్యం వుంది.

1)

ఆహారం :

తిండి యిప్రాయేలీయులకు పెద్ద శోధన. వాళ్లు ఎడారిలో ఆహారం దొరక్క మోషేమీదా ప్రభువమీదా గొణిగారు. అప్పడు ప్రభువు వాళ్ళకొరకు మన్నా కురిపించాడు - నిర్గమ 16,3. ఇది మొదటి శోధన.

క్రీస్తు ఎడారిలోని ఓ కొండమీద నలువదినాళ్లు ఉపవాసం చేసాక అతనికికూడ ఆకలివేసింది. క్రీస్తునికూడ దేవునిమీద గొణిగేలా చేయాలనుకొంది పిశాచం. కనుక ఆ కొండమీది గుండ్రాళ్ళను రొట్టెలుగా మార్చి భుజించమని సలహాయిచ్చింది - మత్త 43. కాని ప్రభువు పిశాచప్రయత్నాన్ని గుర్తించాడు. “మానవుడు ఒక్క రొట్టెచేతనేగాదు, దేవుడు పలికే ప్రతిమాటవల్లా జీవిస్తాడు" అని బదులు చెప్పాడు - ద్వితీ 8,3. ఈ పూర్వవేదవాక్యం మీద వ్యాఖ్యా చెపుతూ జ్ఞానగ్రంథకారుడు "నరుడు ఆహారంవల్లనేగాక దైవవార్తవల్లకూడ