పుట:Bhoojaraajiiyamu.pdf/94

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

భోజచరిత్ర

33


ఉ.

అంతఁ బ్రయాగమాధవుఁ డనంతదయానిధి పద్మవాసినీ
కాంతుఁడు వారికోర్కి యొసఁగంగఁ దదీయవరోపలబ్ధి య
త్యంతనిరూఢమై నెగడునట్లుగ విప్రుఁడు సూర్యకాంతభూ
కాంతునియందుఁ బద్మవతి గాదిలితల్లిగఁ బుట్టె మేదినిన్.

32


క.

ఆవనితలు నొక్కొక వసు
ధావల్లభునందు సముచితంబగు ప్రాదు
ర్భావము నొందిరి భాగ్య
శ్రీవిలసితరూపములు ప్రసిద్ధికి నెక్కన్.

33


వ.

ఇట్లు పుట్టి యాద్విజుండు భోజుం డనుపేరఁ బ్రసిద్ధుం డయ్యే, [1]నయ్యంగనా
రత్నంబులు నలువురును సుగంధి పద్మగంధి కనకవతి చంద్రప్రభ లను
నన్వర్ధనామంబులతో నతనికి భార్య లైరి; యివ్విధంబున నతండు వివిధవిభవ
విలసితుండును, నత్యంతరూపసంపన్నుండును. సకలకళాప్రవీణుండును,
లాటదేశంబునందు ధారానగరంబున కధీశ్వరుండై యనేకవర్షంబులు రాజ్యంబు
చేసె నట్లు గావునఁ బ్రయాగతీర్థం బిష్టకామ్యసిద్ధి ప్రదం బని పలికితి' నని
చెప్పిన.

34


చ.

'విమలవిచార! నీవలన వింటిఁ బ్రయాగమహత్త్వమెల్లఁ ద
త్సముదిత[2]పూర్వపుణ్యఫలజన్ముఁడు భోజవిభుండు భూమి యే
క్రమమున నేలె? వాఁ డటులు రాజ్యము సేయుదినంబులన్ విశే
ష మొకటి యెద్ది యేనియును సన్మునినాయక రూఢి కెక్కెనే?'

35


చ.

అనవుడు నానృపాలునకు నామహనీయవివేకశీలుఁ డి
ట్లను; 'మును భోజుఁ డాదిసృపులట్టుల రాజ్యము చేసె, వావి వ
ర్తనము నుతింప నల్పుల తరంబె? మహిం జతురుత్తరంబుగాఁ
దనరిన షష్టివిద్యలు నతం డెఱిఁగింపక కల్గ వేరికిన్.

36


చ.

తనుఁ గనుఁగొన్నవారు కవితాఘను లౌదురు; తద్విశేష మెం
తని గుఱి పెట్టవచ్చు మనుజాధిప! యిన్నిటికంటె నెక్కు డిం
క నొకటి చెప్పెద న్విను మఖండితయై యొకవిద్య చేరె నా
తనికి సమస్తభూజనకదంబము ప్రస్తుతి చేయునట్లుగన్.

37
  1. నంగనారత్నంబులు
  2. పూర్ణ