పుట:Bhoojaraajiiyamu.pdf/86

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దత్తాత్రేయదర్శనము

25


ఆ.

'అడుగు మింక నెట్టి యభిలాష?' యనిన 'నా
కింతకంటెఁ గోర్కి యేమి గలదు?
స్వామి! యీకథాప్రసంగంబు వినువారు
నిరయరహితు లగుచు నెగడ నిమ్ము.'

124


వ.

అని జగద్ధితలబ్ధనరుండై యా భూవరుండు.

125


ఉ.

'ఓమునినాథచంద్ర కరుణోర్జితచిత్త! త్వదీయదర్శనం
బేమి యొనర్ప లేదు? కడ యెవ్వరు గానఁగ లేరు నీమహ
త్త్వామృతవాహి, కే ననఁగ నల్పుఁడ, నెంతటివాఁడ, నార్తర
క్షామణి వీవు; నీకు సరి గల్గునె యెన్నఁడు నేజగంబులన్!

126


ఉ.

నీవు జగన్నివాసుఁడవు, నీకు సమస్తము నొక్కరూప; యి
ట్లై విలసిల్లుచుండియుఁ బ్రియంబు ప్రయాగము, హేమకూటమున్,
రా వగు రంగధామము ననంగలరావుల మూఁడు నంటి, ల
క్ష్మీవర! యందుఁ జొప్పడు విశేషము నాకు నుపన్యసింపవే!'

127


వ.

అనిన దత్తాత్రేయుం డి ట్లనియె.

128


క.

యాగంబుల నగుఫలమును
యోగంబులవలన నగు సమున్నతియును నా
నాగమవిహితార్చల నగు
భోగము శ్రీరంగసేవఁ బొలుపుగ నెగడున్.

129


ఆ.

అఖిలతీర్థఫలము నంతనంతం బగుఁ
గాని, రంగధామగామి యైన
యతని కొదవు నపునరావృత్తిసౌఖ్యంబు;
దీనిఁ బోల వితరతీర్థతతులు.

130


వ.

మఱియు హేమకూటమహత్త్వంబు చెప్పెద దత్తావధానుండవై యాకర్ణింపుము.

131


చ.

అజునకుఁ బైఁడికొండయు, సుధాంశుకళాకమనీయమౌళికిన్
రజతనగంబుఁ బోలె, ననురాగ మొనర్ప మదీయబుద్ధికిన్
సుజనవరేణ్య! వెండియును జూతుము విందుము గాని యట్టి య
క్కజ మగు పర్వతంబు మఱి గల్గదు సుమ్ము ధరాతలంబునన్.

132