పుట:Bhoojaraajiiyamu.pdf/70

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కవివంశాభివర్ణనము

9


స్ఫారుఁడు సింగనయును నను
వారలు పుట్టి రిలఁ బుష్పవంతుల మాడ్కిన్.

37


వ.

అయ్యిరువురయందు నగ్రసంభవుండు.

38


సీ.

సత్యభాషణమును సాధుపోషణమును
       సహజభూషణముగా జరగువాఁడు
ఆర్తరక్షణము దయార్ద్రశిక్షణము ను
       దాత్తలక్షణముగాఁ దనరువాఁడు
సుకృతభావనమును సుకవిసేవనమును
       నిత్యజీవనముగా నెగడువాఁడు
విష్ణుకీర్తనమును విమలవర్తనమును
       విహితవర్తనముగా వెలయువాఁడు


ఆ.

వాఁడె చూడుఁ డనుచు వసుధాజనంబులు
ప్రస్తుతింప నొప్పు భవ్యచరితుఁ
డుభయకులపవిత్రుఁ డురుకీర్తిధవళిత
దిక్కుఁ డెఱ్ఱమాంబ తిక్కవిభుఁడు.

39


సీ.

విలసితంబగు కృష్ణవేణి మలాపహా
రిణి భీమరథినా ధరిత్రియందుఁ
       దనరునదీత్రయాంతర్వేది యగు పావ
       నక్షేత్రమున శోభనమున కెల్ల
ధర నివాసంబగు పెరుమగూరుపురంబు
       నందు విద్వజ్జనానంద మైన
జీవనస్థితిచేతఁ జెన్నొంది వంశక
       ర్తృత్వసంపత్తిఁ బ్రభుత్వ మొంది


తే.

నెమ్మి ప్రత్యక్షపరమపద మ్మనంగ
నొప్పు శ్రీకాకుళంబున కొడయఁ డైన
యంధ్రవల్లభహరిసేవ నలరుచుండుఁ
బెక్కుభంగుల ముమ్మడితిక్కవిభుఁడు.

40