పుట:Bhoojaraajiiyamu.pdf/238

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వంజరుని కథ

177


సీ.

గంగకుఁ గొని పోయి కలుపుచో గంగ ప్ర
       త్యక్షమై 'నీవు బ్రాహ్మణుఁడ వకట
శూద్రశల్యములు దెచ్చుట నీకుఁ బాడియే ?'
       యనిన నేఁ బూర్వవృత్తాంత మెల్ల
జెప్పి నాయెడఁబాటు దప్పక యట్లు దె
       చ్చితి నేమి సేతు నయ్యతివరూప
మచ్చొత్తినట్లు నా యంతరంగంబునఁ
       బాయకున్నది మరుబాణములకు


ఆ.

దెప్ప మైతి ననుచు ఱెప్పలఁ గన్నునీ
రపుడు గ్రుక్కికొనుడుఁ గృప దలిర్ప
నస్థిచయముమీఁద నాగంగ యొకమందు
వైవ నిది పునర్భవంబు నొందె.

14


క.

క్షీరాంబుధిఁ దఱువఁగ మును
శ్రీరమణి జనింపఁ దోన శీతకరుండున్
బోరన పుట్టినక్రియ నీ
భూరమణుఁడు పుట్టెఁ బొలతి పుట్టుకతోడన్.

15


ఉ.

అంత నదృశ్యమై చనియె నాదివిజాపగ , యేను వేడ్క ని
య్యంతికరంబు పట్టఁ గర మెత్తఁగఁ దా నెడ సొచ్చి దీనితోఁ
బంతము దక్కి మున్ను ఘనపావకకీలల మేను వైచి యీ
యంతరమందు నీకుఁ గుటిలాలక నొప్పన చేసి పోదునే.

16


ఆ.

వలదు తొలఁగు వెఱ్ఱివాఁడ వయ్యెద వీ ల
తాంగిఁ గదిసితేని యనిన నస్థి
సంచయంబు పుణ్యజలములఁ గలిపి ప్రా
ణములు మగుడ బడసినాఁడ నేను.

17


ఆ.

నానిమిత్తమునను మానిని యిచ్చోట
బ్రతికె నింతితోడఁ [1]బరిణయింతు

  1. బరిణమింతు