పుట:Bhoojaraajiiyamu.pdf/237

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

176

భోజరాజీయము ఆశ్వా 6


వ.

మహోగ్రంబైన తపస్సు చేయుచున్నంతఁ దదీయతపంబు చెఱుపనో యన
నచ్చరలేమం బోని కామినీమణిని.

6


క.

ఒక్కతెఁ దోడ్కొని యచటికి
నొక్క మహీసురుఁడు, నొక్క యుర్వీశ్వరుఁడున్,
జొక్కమగు నొక్క వైశ్యుఁడు,
నొక్క చతుర్ధుండు వచ్చి యొండొరుఁ గడవన్.

7


క.

ఆమనుజాధీశునకుఁ బ్ర
ణామము లొనరింప నతఁడు నలుగురఁ గని 'మీ
రీమగువయుఁ దగ నిచటికి
నేమిటి కి ట్లరుగుదెంచు టేర్పడఁ జెపుఁడా!'

8


వ.

అని యడిగిన నతనికి బ్రాహ్మణుం డి ట్లనియె.

9


చ.

అనయము వేశ్య యీతరుణి, యీతఁడు క్షత్రియుఁ, డేను విప్రుఁడన్,
విను వణిజుండు వాఁ, డతఁడు వెల్మయు నల్వురుఁ దొల్లి దీని ది
క్కునఁ జరియించుచుండుదుము! కొండొకకాలము చెల్ల నింతి మా
మనములఁ గల్గు ప్రేమపరిమాణ మెఱుంగఁ దలంచి యి ట్లనున్.

10


ఉ.

'నీరును బాలుఁ బోలె మన నెయ్యము తియ్యము నొంది నేఁడు సొం
పారెడు, మీఁద నా కొకటి యైనఁ బదంపడి యే మొనర్తురో
మీ' రని యొత్తి చూచుటయు మేలుగ విప్రుఁడు 'నీకు నగ్నిసం
స్కార మొనర్చి శల్యములు జాహ్నవికిం గొనిపోదు నే' ననెన్.

11


ఉ.

చచ్చినతోన చత్తు ననె క్షత్రియజాతుఁడు, వైశ్యుఁ డర్థమున్
వెచ్చము సేయువాఁడ ననె, విప్రముఖంబున మించి కాష్ఠముల్
దెచ్చి దహించువాఁడ ననెఁ దెంపున నాలవజాతియాతఁ డీ
యచ్చునఁ బల్కు నప్పలుకు లాదటఁ గైకొని యుండు నింతియున్.

12


ఆ.

అంతఁ గొంతకాల మరుగ నాయింతి కృ
తాంతుప్రోలి కరిగె, నతఁడు దోన
చచ్చె, నితఁడు ధనము వెచ్చించె, వాఁడు ద
హించె, నేను శల్యసంచయంబు.

13