పుట:Bhoojaraajiiyamu.pdf/225

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

164

భోజరాజీయము ఆశ్వా 6


క.

గృహపతి లేనిగృహం బది
గ్రహపతిరహిత మగుదినముగతి మధ్యంబై
మహిమ చెడి యుండుఁ గావున
బహుచింతాలతలఁ జిక్కు వడక యరుగుమా!'

184


చ.

అనవుడు నట్ల కాక యని యంబిక వీడ్కొని యాత్మభూమికిం
జనియెడువేడ్క నివ్వటిల జాహ్నవి దాఁటి మహీసురుండు నె
మ్మనమున నల్ల యంత్యజునిమాట దలంచి య దేమిచందమో
కనుగొని పోదు నంచు నెసకంబుగఁ [1]గ్రమ్మఱి నిల్చి యి ట్లనున్.

185


క.

'ఓ దేవి! వినుము ని న్నొక
మాదిగవాఁ డడిగె వానిమాటకుఁ గలదే
యే దైన నొక్కయుత్తర
మాదట నెఱిఁగింపు నాకు నరుగఁగ వలయున్.'

186

మాదిగవాని కథ

మ.

అనినం గంగ నిజాంగదీప్తినిచయం బవ్వాహినీమధ్య మె
ల్ల నతిస్నిగ్ధముగా నొనర్ప నయనోల్లాసంబు మందస్మితా
ననకాంతిం బొదలింపఁ గంకణ[2]రవోన్నాదంబుతో హస్త మె
త్తి నయం బారఁగఁ బల్కు నోద్విజుఁడ! యర్థిన్ వింటి నీవాక్యముల్.

187


ఉ.

శీలగుణోన్నతుం డమలచిత్తుఁడు మత్ప్రియసేవకుండు చం
డాలుఁ డనంగ రా దతిదృఢవ్రతుఁ డాతనికిన్ శుభంబె; నా
మేలును జెప్పు మాతనికి; మిత్రజ లోనగు పుణ్యవాహినీ
జాలముతోడ విశ్వపతిసన్నిధి నెమ్మదిఁ బాయ కుండుదున్.

188


మ.

అని గంభీరరవంబునం బలుకుపుణ్యాకారిణిం బ్రీతిఁ గ
ల్గొని విప్రుండు కరాబ్జము ల్మొగిచి 'నీకున్ మ్రొక్కెదన్ దేవి! యే
జనులుం గానరు నీదుదివ్యతను వస్మద్భాగధేయంబుపెం
పున నేఁ గంటి భవత్కటాక్ష మెలమిం బొందించె నాడెందమున్.

189
  1. గ్రమ్మఱనిచ్చి
  2. రవోన్మాదంబుతో