పుట:Bhoojaraajiiyamu.pdf/224

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

163

వ్యాధుని కధ


జేరెఁడు చాఱబియ్యమును జిత్త మెలర్పఁగఁ దానఁ జేసి బృం
దారకరాజ్యతుల్య మగుధారుణి యేలుట కిట్లు పుట్టితిన్.

177


వ.

అని పలికి యర్భకుండు పూర్వజన్మంబునం దాను గిరాతుండై యుండిననాఁ
డతనికిఁ జేసినసత్కారంబుకొలంది దెలిపె మఱియు ని ట్లనియె; 'అయ్యా !
యయ్యల్పదానంబువలన నా కిట్టి యనల్పఫలంబు సిద్ధించె నీవు నిరంతరాన్న
దానశీలుండవు నీ కెంతటి ఫలంబు గల్గునో యది యాపరమేశ్వరుండే
యెఱంగుం గాని యన్యు లెఱుంగ లేరు, నీవు విచ్చేయు' మనిన నాద్విజా
తుండు ప్రీతుండై.

178


క.

అంగిరునిం దగ వీడ్కొని
యంగీకృతసుప్రయాణుఁడై ముక్తిపుర
ప్రాంగణ మగుకాశీపురి
కిం గర మనురాగమున మగిడి చనుదెంచెన్.

179


ఉ.

క్రమ్మఱ నాభవానిపదకంజయుగంబు శిరంబు సోఁక మో
దమ్మున్న జాఁగి మ్రొక్కి, 'వనితాతిలకంబ! భవన్మతంబునం
గ్రమ్మఱ నేఁగి యాశిశుముఖంబున నే వినఁగంటి నన్నదా
నమ్ముఫలం బగణ్య మని' నావుడుఁ బార్వతి ప్రీతి ని ట్లనున్.

180


క.

'విను విప్రోత్తమ! నీ వ
చ్చినపని సిద్ధించె నింకఁ జేరుము భవదీ
యనివాసమ్మునకు గృహ
స్థునకుఁ బ్రవాసైకవృత్తి దోషము సుమ్మీ!

181


క.

మఱి యాశ్రమస్థు లెల్లను
వఱలు గృహస్థాశ్రమంబువారిన కానం
బఱతెంతురు తమ దగు న
క్కఱ దీర్చుకొనంగ నొందుగతి లే కునికిన్.

182


చ.

వ్రతులు గృహస్థువాకిటికి వచ్చి యథోచితపూజఁ గానరే
నతనిగృహస్థధర్మ మది యంతయు నిష్ఫల మండ్రు; వెండి య
య్యతిథికృతాఘసంచయము లన్నియు నాతనిఁ బొందుఁ, దత్సమం
చితసుకృతంబు లయ్యతిథి జెందుఁ జుమీ పరమార్థ మారయన్.

183