పుట:Bhoojaraajiiyamu.pdf/221

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

160

భోజరాజీయము ఆశ్వా 6

వ్యాధుని కథ

శా.

ఆవిప్రుం డొకచోటఁ జొచ్చి వని ఘోరారణ్యమార్గంబునన్
దీవ ల్గాళ్ళను జుట్టఁ దొట్రుపడుచుం ది క్కేది విభ్రాంతుఁడై
పోవం బోవగ నొక్కబోయ గని యీపుణ్యాత్ముఁ డేయూరికిన్
బోవం బోయియొ త్రోవఁ దప్పె ననుచుం బూర్ణానుకంపామతిన్.

158


ఉ.

ఆతనిఁ జేరఁ బోయి 'వసుధామర! యేపురి కేఁగె దీవు? ఖ
ద్యోతనుఁ డస్తపర్వతగతుం డగుదెంచెఁ బథంబు దూర మీ
రీతి నరణ్యమధ్యమున రేయి చరింప వశంబె యెట్టిని
ర్భీతుల కైన? వన్యమృగబృందము మైమయిఁ బోవ నిచ్చునే!

159


క.

అనవుడు నా బ్రాహ్మణుఁ డా
వనచరుతో 'నేను హేమవతపురమునకున్
జనుచుండి త్రోవ దప్పితి
నెనయఁగ నా త్రోవ చూపు మేఁగెద' ననినన్.

160


క.

'ఏటికి వేగిరపడ నీ
పూట నిచట నిలిచి రేపు పోవఁగరాదే
మాటలఁ దప్పితి తెరు వి
చ్చోటికి నమడకుఁ బడియెఁ జు మ్మది' [1]యనియెన్.

161


చ.

అని తన పోడుచేనికడ కాతనిఁ దోఁకొని పోయి బోయ యి
ట్లను 'నివె పొట్టికందులును నన్ములు నున్నవి క్రొత్తకుండ లే
దనఘ! యుపాయ మెద్ది? కడు నాఁకొని వచ్చినవాఁడ వీవు నీ
పనిచినయట్ల చేసెదఁ గృపామతి నానతి యిమ్ము' నావుడున్.

162


క.

'నీసౌజన్యమున మదా
యాసము సర్వమును బాసె నంతియ చాలున్.
గ్రాసేచ్ఛ లేదు; నీవు వృ
థా సంకటపడకు సౌఖ్యతర మిది నాకున్.'

163
  1. యనినన్