పుట:Bhoojaraajiiyamu.pdf/204

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గోవ్యాఘ్రసంవాదము

143


క.

ఇవ్విధమున శోకింపఁగ
నవ్వత్సశిరంబుమీఁద నానన మిడి 'నీ
వెవ్వరికిఁ గాఁగ వగచెద
వివ్వలవనిజాలి పడఁగ నేటికిఁ బుత్రా!

43


చ.

అరుదుగ సత్యవాక్యము సహాయముగాఁ బులిఱేని వక్త్రగ
హ్వర మను పెద్దత్రోవను రయంబున స్వర్గసుఖంబుఁ జూఱకో
నరుగుచునున్నదాన; నిది హర్షము నొందెడు వేళ గాక దు
స్తర మగుశోకముం బొరయుదానికిఁ గారణ మేమి చెప్పుమా.

44


క.

పుట్టినపిమ్మటఁ జావును
గట్టి; వృథామరణ మొందుకంటె బుధులకున్
దట్టమగు కీర్తిసుకృతము
లిట్టలముగఁ గల్గుచావు లింపులు గావే!

45


ఉ.

శోకము దక్క లెమ్ము గుణశోభిత! నీ' వనఁ దల్లివాక్యముల్
గైకొని తత్తనూభవుఁడు కంపము నొందుచు లేచి 'యక్కటా
గోకులభూష, నీకు సమకూరెడు శాశ్వతపుణ్యలోకముల్
నాకు నగమ్యదేశములె? నన్నును దోఁకొని పొమ్ము' నావుడున్.

46


క.

సంతతి యెడ తెగి నంతన
నెంతటి పుణ్యగతు లైన నెడ తెగు నని సి
ద్ధాంతము విను నాతమ్ముఁడ!
చింతింపకు మొక్కతెలివి చెప్పెద నీకున్.

47


క.

సుతుఁడు మహిఁ దల్లిదండ్రులు
బ్రతిదినమును బ్రోచు నన్నపానాదులచే ;
మృతు లైనపిదపఁ బితృదే
వతపూజలఁ జేసి వారి వదలక ప్రోచున్.

48


ఉ.

కావునఁ బుత్రజన్మము జగంబున భుక్తికి నిత్యముక్తికిన్
దావల మండ్రు, నిన్నుఁ గని ధన్యత నొందితి; మత్సవిత్రవం
శావళి నీకతంబున నిరంతరమై కొనసాఁగె నేని నా
దేవనివాస మాదియగు దివ్యపదంబులు నాకుఁ జేకుఱున్.

49