పుట:Bhoojaraajiiyamu.pdf/202

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గోవ్యాఘ్రసంవాదము

141


క.

ఆడకు మసత్యభాషలు
కూడకు గొఱగానివాని గొంకక యొరు లె
గ్గాడిన నెదు రుత్తరమీఁ
జూడకు విని విననివాని చొప్పునఁ జనుమీ.

29


క.

ఒంటి చరింపకు పొలమున,
నింటికిఁ గడుప్రొద్దు గలుగ నేతెంచుచురా,
వెంటఁ బడి పొడుచుగోవుల
జంటఁ జనకు, క్రయ్యఁబడక సందడి యగుచోన్.

30


క.

అంగజకేళికి దివిరెడు
పుంగవులను మసరు కలిసి పోరాడకు, వీఁ
కం గొలు ద్రవ్వు వృషభము
లం గదియకు తెవులుగొంటులం గూడకుమీ.

31


క.

తొడుకు దినఁబోవు పసరము
బడిఁ బోకుము, తురగగార్దభద్విరదాదుల్
నడచుపథంబున కడ్డము
సుడియకు, దుర్జనులు మెలఁగుచో నిలువకుమీ.

32


క.

నూతుల దరులను లోఁతగు
పాతటికసవులను నెట్టిపచ్చిక యున్నన్
బ్రాతిపడి మేయఁ బోకుము
మూతి నిడకు ముగ్రసత్వములు గలనీటన్.

33


క.

ఏనుఁ గలిగియుండఁగ నె
వ్వానికి నిను ముద్దు సేయ వాలాయ మగున్
గాని, యిటమీఁద నెవ్వఁడు
గానికిఁ గైకొనక చుల్కగాఁ జూచుఁ జుమీ.

34


క.

చులకన జలరుహతంతువు,
చులుకన తృణకణము, దూది చుల్కనసుమ్మీ,
యిల నెగయుధూళి చుల్కన,
చులుకన మఱి తల్లి లేని సుతుఁడు కుమారా!

35