పుట:Bhoojaraajiiyamu.pdf/197

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీ

భోజరాజీయము

షష్ఠాశ్వాసము

శ్రీయువతీ మృదువచనర
సాయన పరిపూర్ణకర్ణ! శశింభవర్ణా!
మాయాతీత! సువర్ణ
స్తేయాద్యంహోవిఘాత! శ్రీనరసింహా!

1


వ.

అవధరింపు మమ్మహాపతి కి ట్లనియె నట్లు రత్నమండనుండు చెప్పు గోవ్యాఘ్ర
సంవాదకథావిశేషంబునఁ బావకలోముచరిత్రంబు విని 'చిత్రకాయం బెటు
వోయె నక్కథ విని బ్రహ్మరాక్షసుం డేమి చేసె నెఱింగింపు' మని భోజుం
డడిగిన సర్పటి యి ట్లని చెప్పె నాప్రసంగంబు విని.

2


క.

తా నెఱిఁగినకథ చెప్పితిఁ
బో నీ కుండెడునె యింకఁ బులి యని మదిలో
నూనిన సంతసమున నా
ధేనువుఁ దాఁ జనవు మెఱపి ధృతి ని ట్లనియెన్.

3


క.

'పావకలోముని చరితము
భావ మలర వింటి వింకఁ బంపుము నన్నున్
రావలయుఁ దిరిగి వేగమ'
నావుడుఁ బులి గోవుఁ జూచి నగి యి ట్లనియెన్.

4


క.

ఏమిటికి నెట్టుకొనియెదు
వీమాటల నాకుఁ గడుపు నిండునె పుత్ర
వ్యామోహ మేల విడువవు
నాముందటఁ బ్రిదుల వచ్చునా నీ కింకన్.

5