పుట:Bhoojaraajiiyamu.pdf/190

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పావకలోముని కథ

129


వ.

ఇట్లు తన మ్రోల కేతెంచిన సిద్ధవనితకు గొబ్బున లేచి మ్రొక్కి యక్కాంత
చేతం గృతాశీర్వచనుండై సబహుమానంబుగాఁ దెచ్చి కూర్చుండం బెట్టు
కొనిన.

125


క.

పెదవులు గదలెం గదలవు
రదనంబులు గానవచ్చె రావను పాటిన్
మృదువచన రచన లెసఁగఁగ
ముదిత యతని హృదయకమలముం గరఁగించెన్.

126


వ.

ఇవ్విధంబునఁ బూర్వరంగంబులగు ప్రసంగంబులు చెల్లం దదవసరంబునఁ
బావకలోముండు.

127


తే.

'ఎచటనుండి వచ్చి తిందుల' కనిన న
య్యగ్నిలోమునకును ననియె వనిత
'సకలభూములందుఁ జరియింతు నే, నిక్క
డక్క డనఁగఁ గలదె యొక్కచోటు?'

128


క.

అన విని 'నీవు చరించుచుఁ
గనినట్టివి వింత లేమి గల?' వని యడుగన్
గను మట్టులైనఁ జెప్పెద
నని యి ట్లని చెప్పెఁ దాపసాంగన ప్రీతిన్.

129


చ.

'అనుమతినాఁగ నాట్యనగరాధిపుఁ డయ్యజవక్షు కూఁతు రా
కనకలతాంగిఁ దత్కమలగంధిని మున్ను స్వయంవరోత్సవం
బున వరియించినాతఁ డెట పోయిననో, మఱి యొక్కఁ డేను బొ
మ్మని కొనివచ్చి తత్పితృసమక్షమున న్మదిరాక్షి నుంచినన్.

130


ఆ.

వార లియ్యకొని వివాహంబు సేయ ను
పక్రమింపఁ గొన్ని వక్రభాష
లుచ్చరించి వీని నొల్ల, వీఁ డెక్కడి
భర్త నాకు, వీఁడు పాతకుండు.

131


వ.

వీనిం బరిహరించెద. నా పెనిమిటి వచ్చునంతకు నంబికారాధన తత్పరనై
కాలంబు పుచ్చెద నని పంతగించి యున్నయది.

132