పుట:Bhoojaraajiiyamu.pdf/153

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

92

భోజరాజీయము ఆశ్వా. 4


వ.

అనిన నవ్విప్రుండు దమకించి.

90


క.

‘ధన మైనఁ బ్రాణమైనను
వనజానన! యేను నీకు వంచింతునె యే
పని యైన నడుగు మిప్పుడ
యొనరించెద' ననిన నప్పయోరుహముఖియున్.

91


క.

ధన మడుగఁ బ్రాణ మడుగన్
విను పరిణయ మైనపిదప నే నీయెడకుం
జనుదెంచి కొని మత్ప్రియు
నెనయఁగ నేఁ బొంద నాకు నీవర మీవే.'

92


చ.

అనుటయు 'బాపు బాపు నను నాసలపా లొనరించి నెమ్మదిం
జనువెర వె ట్లెఱింగితి, విచారవిమూఢున కైన నీవు ప
ల్కినపలు కియ్యకో లగునె? లేమ! వనంబున జున్ను రేఁచి తి
య్యని మధుపాన మొల్లక రయంబున నొండులపాలు సేయునే.

93


చ.

అది యటులుండె నీ విచటి కప్పుడు వచ్చెద నంటి వౌ, నినుం
గదలఁగ నిచ్చునే విభుఁడు? కాని ప్రసంగము లేల? నీవు నా
తుది నఱ లేక వచ్చుటకుఁ దొయ్యలి! యెవ్వరు పూఁట యంతకుం
బదిలము నిల్వ లేను, మరుబారికిఁ ద్రోవక నన్నుఁ గావవే.

94


క.

యాదృచ్ఛికసురతంబును,
జూదంబున గెల్వఁబడిన సొమ్మును, నుత్క్రో
శాదులు నప్పటి కప్పుడు
కాదే మఱి దుస్సిపోవుఁ గాక నిలుచునే.

95


క.

ఈవేళఁ దప్పిపోయిన
నావల నొకనాఁడు వత్తుననునది నిజమే
నీ వెంత చెప్పినను మ
ద్భావము నమ్మ' దనియతఁడు దాఁ బల్కుటయున్.

96


సీ.

' నా రాక సిద్ధమ్ము నమ్మునీ,' వని పెక్కు
       భంగుల శపథముల్ పలికి యబల