పుట:Bhoojaraajiiyamu.pdf/148

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గోవ్యాఘ్రముల కథ

87


చ.

పులి యటె, దీపనాసలము పొంగున మ్రోఁగుచు నున్కి యట్టె, యి
మ్ముల నొకపాఁడిగో వపుడు ముందటికిం జనుదెంచు నట్టె, హో
నిలు మనినం బయం బడక నిల్చికనుంగొను నట్టె బాపురే
కలఁగక యాడుమాట లయకాలుని నైన శమింపఁ జేయదే.

59


వ.

ఇట్లు నిల్చి యప్పుండరీకం బాధేనువున కిట్లను 'నామిషార్థినై వచ్చు నన్నిట్లు
వారింప గారణం బేమి? నీ వేమి చెప్పెడు? చెప్పు' మనిన నది దాని
కి ట్లనియె.

60


చ.

మును మునుఁ బుట్టె నాకు నొక ముద్దులపట్టి, యతండు పుట్టి యే
డెనిమిదినాళ్ళపాటి గలఁ డింతియ, పూరియు మేయ నేరఁ డేఁ
జని కడుపారఁ జన్గుడిపి చయ్యన వచ్చెద, నన్నుఁ బోయి ర
మ్మని సుకృతంబు గట్టికొనవన్న దయాగుణ ముల్లసిల్లఁగన్.

61


వ.

అని పల్కుచుఁ దనలో ని ట్లని విచారించు.

62


క.

'రేపు చను గుడిపి వచ్చితి
నేపున నం దంద పరువు లిడి యంతటిలో
నాపుడిసెడు నఱగినఁ గొడు
కేపాటులఁ బడునొ వాని కెయ్యది గతియో.

63


ఏ నఱ్ఱు నాకు నుండఁగఁ
దా నను నండ గొని చెవులు దాల వయిచుచున్
మే నెఱుఁగక యుండెడు నా
కూనకు నెవ్వారు దిక్కొకో యిట మీఁదన్.

64


సీ.

 నన్నుఁ గానక పోయి నాపుత్రుఁ డేయావు
       పొదు గైనఁ దొడుకంగఁ గుదిలి కొనుచుఁ
గొమ్మున నదరంటఁ జిమ్మునో సుడిసిన
       నడ్డంబు దాఁకునో గొడ్డుటావు
లుగ్రమహోక్షంబు లోండొంటిఁ దొడరుచోఁ
       ద్రొక్కునో జఠరాగ్నిఁ బొక్కిపడుచుఁ
బొరుగిండులకు నొంటిఁ బోవఁ గుక్కలు దోలి
       కఱచునో గతిమాలి యఱచుకొనుచు