పుట:Bhoojaraajiiyamu.pdf/145

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

84

భోజరాజీయము ఆశ్వా 4


ఉ.

క్రూరపుఁ జూపులు న్నిడుదకోఱలు నుగ్రపుమోము నెత్తుటం
బేరినకోరమీసములు బిఱ్ఱనవెండ్రుకలుం గృశత్వముం
గూరినదేహము న్వెడఁదకుక్షియు ఘోరరవంబు గల్గి యే
పారిన బ్రహ్మరాక్షసుఁ డుదగ్రబలుం డొకఁ డవ్వనంబులో.

42


చ.

ఉరుధరణీజశాఖపయి నుండి ఘనధ్వనిఁ దన్నుఁ బిల్వ సుం
దరతరవక్త్ర మెత్తి వెసఁ దప్పక చూచి కుమారుఁ డాత్మన
చ్చెరువడి పుష్పగంధికయి చెప్పిన యప్పలుకు ల్దలంచి 'యే
వ్వరికిని మీఱ రా దజుఁడు వ్రాసినవ్రా' లనుమాట దప్పునే.

43


ఆ.

ఆలతాంగిఁ బెండ్లియాడి తొమ్మిది ప్రొద్దు
లయ్యే నేఁటితోడ నదినిమిత్త
మై కదా భయంకరాకృతితోఁ బొడ
చూపె బ్రహ్మరాక్షసుండు నేఁడు.

44


క.

అని కొండొక చింతింపఁగ
ననుమానం బేల నాకు నాహారముగా
నిను నియమించె నజుఁడు ర
మ్మని వెండియుఁ బిల్చె నాతఁ డాగ్రహ మెసఁగన్.

45


వ.

ఇట్లు నెట్టుకొని పిల్చుచున్న బ్రహ్మరాక్షసునకు ధైర్యగుణమండనుం డగు
రత్నమండనుందు సవినయంబుగా ని ట్లనియె “నయ్యా! నీ యానతి నేను
జేసెద నా కొక్క విన్నపంబుగల దది యాకర్ణింపుము.

46


సీ.

'ఏను బోయినజాడ యెఱుఁగక నాతల్లి
       దండ్రులు నెంతయుఁ దల్లడిలుచు
నుండుదురో నన్ను నోరంత ప్రొద్దును
       నేత్తి పెంచినదాది యెంత వగచు
చుండునో నాచేయు నుద్యోగముల కెల్ల
       ననుకూలుఁ డై వచ్చు నాప్తుఁ డింద్ర
దత్తుఁడు దానెంత తలఁకునో నాకు దో
       సిలి యొగ్గి యే సౌఖ్యములును లేక