పుట:Bhoojaraajiiyamu.pdf/116

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

భోజచరిత్ర

55


తే.

దగ విచారించి చేసితి, దానఁజేసి
పుత్రవంతుఁడ వగుము పవిత్రచరిత!
యోడకుండుము నీ' వని యూఱడించి
మనుజవిభుతోడ సర్పటి యనియె మఱియు.

176


సీ.

బొంకెడుపురుషునిఁ బొంద నొల్లదు లక్ష్మి
       తొల్లింటి సిరియును దొలఁగి పోవు;
బ్రహ్మహత్యాదిపాపము లెన్ని యైనను
       నిల నసత్యంబుతో నెత్తు రావు,
మద్యపానము చేయ మరగినాతనికంటెఁ
       గీడు సు మ్మనృతంబు లాడువాఁడె;
యూర్ధ్వలోకముత్రోవ యుడిగించి యధమలో
       కప్రాప్తి గావించుఁ గల్లతనము,


ఆ.

కాన నింతనుండి మానవేశ్వర! నీవు
నిత్యసత్యనిష్ఠ నెఱపు మయ్య
సత్యమందె నిలుచు సర్వలోకములు, స
త్యవ్రతంబుకంటెఁ దపము లేదు.

177


క.

ఇప్పుడు నీకును నాకును
జొప్పడిన వివాదమునకు శోకింపకు, నీ
తప్పున నై నది గా దిది
యప్పరమేశ్వరుఁడు మూల ముఖిలంబునకున్.

178


క.

అని బోధింప నతఁడు దన
మనము శరత్కాలసరసిమాడ్కిఁ బ్రసన్న
త్వనిరూఢంబుగ నాతనిఁ
గనుఁగొని యి ట్లనియె వినయ గౌరవ మెసఁగన్.

179


క.

'మీకరుణఁజేసి వంధ్యత
లేక మదీయోదరము ఫలించినఁ జాలున్
నా కంతియ పదివేలు, ని
రాకులమతి నైతి' ననియె నని చెప్పుటయున్.

180