పుట:Bhoojaraajiiyamu.pdf/101

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

40

భోజరాజీయము ఆశ్వా. 2


ఆ.

మేలు గాక పొదఁడు మీమాట లేనిటం
ద్రోపు చేయఁ జాల మీపురమున
కరుగుదెంతు ననిన నౌఁ గాక యని గంధ
సింధురాధిరూఢుఁ జేసె నతని.

79


క.

దివిజగణంబులు గొలువఁగ
ధవళాశ్వము నెక్కి చనుశతక్రతుగతి న
య్యవనీశ్వరుండు వివిధా
హవవీరులు గొలువ నుత్తమాశ్వము నెక్కెన్.

80


వ.

ఇట్లు సర్పటిం దోడ్కొని చని త్ర్యంబకసఖుండగు కుబేరుండునుం బోలె
నాధీరుండు వివిధవిభవోదారుం డగుచు నిరంతరాలంకారసారం బగు ధారా
నగరంబు ప్రవేశించునప్పుడు.

81


సీ.

భూచక్రమునఁ గల రాచబిడ్డల కెల్లఁ
       దిలక మై పుట్టినచెలువుఁ డితఁడె
కర్ణాదిదాతల కర లెల్ల మఱపించి
       పేరు గాంచిన దానశూరుఁ డితఁడె
సారంబులగు చతుష్షష్టివిద్యలకును
       దాన తావక మగు ధన్యుఁ డితఁడె
దనమోముఁ జూచిన జనుల కెల్లఁ గవిత్వ
       సరణిఁ జేకుఱఁ జేయు చతురుఁ డితఁడె


తే.

నిఖిలరాజన్యమకుటమణిప్రభావి
భూషితాంఘ్రిపద్ముం డగుభోజుఁ డితఁడె
యనుచుఁ గొనియారు పౌరుల హర్షభాష
లంబునిధిఘోషమునకంటె నతిశయిల్లె.

82


వ.

ఇటు సమస్తజనంబులకు నయనపర్వంబు నిర్వహించుచుండం జని యేనుంగు
మొగసాల చొచ్చి యాన రేంద్రుం డఖిలపరివారంబు నుచితప్రకారంబున వీడు
కొల్పి సర్పటి నొక్క వీడుపట్టున విడియింపను, నతనికి నర్ఘసత్కారంబు
లాచరింపను నాప్తజనంబుల నియమించి యశ్వావతరణంబు చేసి యంతః
పురంబున కరిగి మజ్జనభోజనాదులు సల్పి యథార్హవిహారంబుల దినశేషంబు
గడపి రాత్రి యగుడు.

83