ఈ పుట ఆమోదించబడ్డది
వీని నన్నిటింబట్టిజూడ నీశతకమును ఒక్కకవియే చరించెననుటకు సంశయ మెంతమాత్రముండదనియు, నీ గాధలన్నియు బుక్కిటి పురాణములనియు బాలునకు సయితము తెలియక పోదు.
ఈకవి యుపమానరూపమున సకలపురాణేతిహాసములను వెల్లడించి పాఠకులకు మహోపకారమొనరించెను. ఇందు వ్యాకరణదోషములని పరిగణింపబడు తావులు కొన్ని కాన్పించుచున్నను నవి లేఖకాది ప్రమాదములనియే నాతలంపు.
ఏదియెట్లున్నను నీయది నీతిప్రదమగు గ్రంథమనియెంచి యెల్లరును బఠింతురు గాకయని కోరుచుంటిని.
ఇట్లు సజ్జన విధేయుడు.
క్రొత్తపల్లి సుందరరామయ్య.
భాస్కర శతకము
శ్రీగల భాగ్యశాలి గడు
జేరగవత్తురు తారుదారె దూ
రాగమన ప్రయాసమున
కాదటనోర్చియునైన నిల్వ ను
ద్యోగముచేసి రత్ననిల
యుండనికాదె సమస్తవాహినుల్
సాగరు జేరుటెల్ల ముని
సన్నుత మద్గురు మూర్తి భాస్కరా!