Jump to content

పుట:Bhaskarasatakamu00bhassher.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లోకమున మయూర కవి సూర్యశతకమునాటి గాథను గల్పించి పుక్కిటిగాథను వ్యాపింపజేసిరి. పద్యములను బట్టి చూడ నీతియె ప్రధానముగ నుండును గాని భక్తి ప్రధానముగ నీతి శతకము గాన్పించదు. ఇంతియు గాక గ్రంథాంతరముల వలన నీ శతకమున బద్యము అష్టోత్తర శతకమును మించి కానవచ్చుచున్నవి. ఇందు భాస్కరాయను సూర్యసంబోధనమునకు 1,40,87 పద్యముల యందు మాత్రమే "మునిసన్నుతమద్గురుమూర్తి" అనియు, "యోగీంద్ర సుతాంఘ్రిపద్మ" అనియు "శుభకారణసన్మునిసేవ్య" అనియు విశేషముల వాడియున్నాడు. దీనినిబట్టి భక్తివిశేషమును లోకమునకు జూపదలంచినవాడు కాడనియు, నీతిని దెలుపుటయే ముఖ్యమని యెంచి పద్యములు వ్రాసెను గాని తనపేరును, ఆద్యంతములయం దెచ్చటను దెలియ బరపకుండుటచే లౌకికకీర్తిని కోరినవాడు కాడనియు స్పష్టమగుచున్నది. పయి మూడు తావుల భాస్కరు విశేషణములగు బద్యపూరణమునకై పెట్టినవేయని తోప జేయుచున్నది.

ఈ గ్రంథమున బూర్వార్థోత్తరార్థముతో గూడిన యుపమానోపమేయసంధాన పద్యములన్నింటిలో బదునేడు పద్యములు మాత్రమే "ఎట్లనగా" అనుసంధానవాక్యమును వాడియున్నాడు. తక్కిన యన్నిపద్యములయందును సంధాన వాక్యమును తెచ్చి పెట్టుకొనునదిగా నిలిపియుండెను. సాధారణముగా నీతని కవిత్వమునందే తెచ్చి పెట్టుకొను నాచారమెక్కుడుగ నెల్లతావుల గాన్పించును. ఈ యాచారము సంస్కృతమునం దధికముగ గాన్పించుచుండునే కాని యాంధ్రమునందంత విరళముగ నుండదు. ఆదారి యిక్కవి కెక్కుదభ్యాసమయినట్లు తోచుచున్నది.

మఱియొక గాధలో నన్నదమ్ములిరువును భాస్కరుడను రాజున కంకితమిచ్చి పెద్దవాడు పూర్వార్థమును, చిన్నవా డుత్తరార్థమును జెప్పి శతకమును సంపూర్తిచేసిరనుట గూడ బాగుగలేదు. ఏమనగా నీశతకమున బూర్వార్థోత్తరార్థ విభజనకు గూడ వీలులేని కొన్ని నీతిపద్యములు కలవు. అంతియేగాక భాస్కరుడను నృపాలుని చెంత దమ పాండిత్య ప్రకర్షనంతగా వెల్లడించి యాతని మెప్పించి బహుమానముల గాంచినవారు, ఎచ్చటనైన దమ విషయమును గాని రాజు విషయమునుగాని నీతిమూలముననే యుద్ఘాటింపకుందురో ; ఒక రాజమాత్రునికే కృతినిచ్చిన యెడల "మునిసన్నుతమద్గురుమూర్తి" అనియు, "యోగీంద్రనుతాంఘ్రిపద్మ" అనియు "శుభకారణసన్మునిసేవ్య" అనియు నీమహత్తర విశేషనములను బెట్టియుందురా ? కవు లిరువురే యైనయెడల నిందలి చివరిపద్యమున "ఇంచుక నేర్పుచాలక, విహీనత జెందిన నా కవిత్వమున్" అని యేకవచనప్రయోగమేల చేసికొందురు ?