పుట:Bharatiyanagarik018597mbp.pdf/90

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


భూమట్టమునుండి పైయంతస్థువరకును, చుట్టునుగూడ నిరుపమములగు శిల్పము లున్నవి. యీ విధమున మూడుమైళ్ళ చుట్టుకొలతగల యీ యాలయమున బౌద్దులచరిత్రము, గాథలు, తత్త్వమును చిత్రింపబడినవి. పైపేర్కొనినటుల నీస్థూపవలయములలో నొక్కొకటి యొక్కొక ప్రదక్షిణ మార్గము. యీ మార్గముల బ్రదక్షిణమొనర్చు భక్తులు గోడలపైనను స్థూపములపైనను లలితవిస్తారము, దివ్యావదానము, జాతకమాల, చండ వ్యూహము మున్నగు బౌద్ద గ్రంథముల ననుసరించి చిత్రింపబడిన బుద్ధుని జీవితమునుగాంచి తన్మయులగు చుండిరి. ఇటులే బోధిసత్వుల చరిత్రము కూడ చిత్రింపబడినది, యీ విధముగ నిచ్చటి గోడలలో నేర్పరుపబడిన శిల్పఫలకములసంఖ్య 1300. ఇవిగాక నీ యాలయపు క్రింది భాగమున మఱి 160 ఫలకములు గలవు.

యీ బొరొబుధుర్ ఆలయమున నిలచిచూచినచో మినొరెయను పర్వతముయొక్క శిఖరము గన్పించును. ఇది యొక మనుష్యుని ముఖమువలె నున్నది. యవద్వీపవాసు లీశిఖరము బొరొబుదుర్ ఆలయమును నిర్మించిన గుణధర్ముని ముఖమని చెప్పుదురు.

యీ యాలయరాజ మెపుడు నిర్మింపబడెనను విషయమున దెల్పు శాసనము లింతవరకును దొరకియుండలేదు. శాసనాధారముపై కాలనిర్ణయ మొనర్పనగు నితర కట్టడములను బొరొబుదుర్ ఆలయమును సరిపోల్చి చూచి కళాపద్ధతి నాధారముగ గొని క్రోఘ్ అను పండితు డీయాలయము క్రీ. శ. 8 వ శతాబ్ది యుత్తరార్థమున నిర్మింప బడియుండునని వ్రాసి యున్నాడు.

బొరొబుదుర్ ఆలయముయొక్క స్వభావమేమి? ఏ మహాత్ముని యస్థికలపై నైనను దీనిని నిర్మించిరా? లేక నేదోనొక మహాకార్యమును సూచించుటకై దీనిని గల్పించిరా? ఇది స్థూపమా, చైత్యమా, విహారమా?