పుట:Bharatiyanagarik018597mbp.pdf/89

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బొరొబుదుర్ దేవాలయము

ఈ యాలయము యవద్వీపశిల్పములలో నెల్ల నగ్రగణ్యము. వర్ణనాతీతమగు నీ కట్టడము చూపరులను విస్మయావిష్టుల నొనర్పుచున్నది. అలంకారములతోడను విగ్రహములతోడను నిండి యెన్నియో యంతరువులు గల యీ నిర్మాణము వివిధదేశములందలి కళాభిమానుల నాకర్షించు చున్నది.

ఇచ్చటి శిల్పియొక్క నైపుణ్యము స్థలనిర్దేశముననే గనవచ్చుచున్నది. జావాలో "కెడు" అను నొక మైదానము గలదు. ఇయ్యది సశ్యశ్యామలమై మనోహరముగ నుండును. ఇందసంఖ్యాకములగు చిన్న చిన్నకట్టడములు గలవు. యీ మైదానమునకు చుట్టును పర్వతములున్నవి. మధ్య నొక కొండగలదు. దానిపైనుండి నలుదిశలను బరికించినచో నొకవంక పచ్చని పైరులును, మఱియొకవంక సాయంసమయమున నీలమేఘములలో విలీనమగు కొండలును, మఱియొకచో ధూమమును విరజిమ్ము నగ్నిపర్వతములును గనుపింపగలవు.

ఇట్టియాలయము దేశాంతరములలోనేగాక భారత దేశమునందు గూడ లేదు. ఇందొక నూతన నిర్మాణపద్దతి యవలంబింపబడినది. మొదట నొకకొండను యెత్తుపల్లములులేక సమముగా చెక్కిరి. దీనిపై చదునైన రాతిపలకల నతికి యటుపై కట్టడములను నిర్మించిరి. యీ కొండపైన మధ్యగా నొకస్థూప మున్నది. దీనిచుట్టు నొకదానిలోనొకటిగ మూడువలయములున్నవి. వీనిలో డెబ్బది రెండు చిన్న స్థూపములు గలవు. యీత్రికోణాకృతిగల కొండకు మూడు వైపులను మూడు ద్వారములున్నవి. వీనిద్వారా నొకదానిపై నొకటిగానున్న స్థూపవలయములకు బోవుటకు మెట్లవరుసలున్నవి. బొరొబుదుర్ ఆలయమునం దేడంతస్థులు గలవు.