పుట:Bharatiyanagarik018597mbp.pdf/88

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భారతీయ నాగరికతా విస్తరణము.

12. యవద్వీపకళ.

భారతదేశమునుండి ప్రాచీనభారతీయులు భారతీయనాగరికతాధినివేశములను దేశాంతరములకు గొనిపోయి వానినట బాదుకొల్పిరి. ఈనూతన భావములును సంస్థలును స్థానికములగువానితోగలసి యీదేశాంతరములలో విలక్షణమగు నాగరికతవర్థిల్లినది. భారతభూమిలో గనియెరుంగని పరిణామమును భారతీయాదర్శము లీ దూరదేశములలో గాంచినవి. ఇందులకు శిల్పకళ ప్రబలమగు నుదాహరణము. అందునను యవద్వీపమునం దీకళ నిరుపమమగు రీతి నభివృద్దినందినది. కాననీయవద్వీపకళను బరీక్షించినచో ప్రాచీనకాలమునం దొకసువిశాలమగు నైతికసామ్రాజ్యమునకు నాయికయై భారతదేశ మెట్టియున్న తాదర్శములను ప్రపంచమున కొసంగెనో దెలియు చున్నది. ఇటుపై యవద్వీపమునందలి కట్టడములును వాని ప్రాశస్త్యమును సంగ్రహముగ వర్ణింపబడుచున్నవి.

యవద్వీపమున చారిత్రశిథిలము లెన్నియో గలవు. వీనినన్నిటిని నేటి ప్రభుత్వములు జాగరూకతతో సంరక్షించుచున్నవి. ఈ శిథిలములకు హిందూదేశమునందలి తాత్కాలిక నిర్మాణములకును సన్నిహితమగు సంబంధము గలదు. యవద్వీప శిథిలములలో నారిటినిమాత్రము బరిశీలించినచో తత్కళాధిక్యత యవగతము కాగలదు.