పుట:Bharatiyanagarik018597mbp.pdf/87

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


క్రీ. శ. 1389 లో పురుక్ చక్రవర్తి మరణించినపిమ్మట బిల్వతిక్తపుర సామ్రాజ్యము క్షీణించెను. అనతికాలమునకేయాతని పుత్రుడును, అల్లుడును సింహాసనమునకై తగవులాడిరి. ఈ యదనున బోర్నియో, సుమత్రా, మలక్కాన్ మున్నగుదీవులు స్వతంత్రించినవి. దీనికితోడుగ నొక పెద్ద కఱవు జావాద్వీపమునంతటిని దుడిచివేసినది. పురుక్ మనుమరాలగు మహితాదేవికాలమున కెదిరిరాజ్యము దహయనువాని నాయకత్వమున తిరుగబడి స్వతంత్రించెను. ఆమెకు పిమ్మట నామెతమ్ముడు కృతవిజయుడు రాజ్యమునకు వచ్చెను. ఈతడు చంపారాజపుత్రికను వివాహము చేసికొనెను. ఆమె మహమ్మదీయమతమునెడ నాదరముజూపెను. ఇంతటినుండియు నామతము జావాద్వీపమున బ్రబలి తుదకచ్చటి హిందూరాజ్యనాశమునకు ముఖ్యకారణముమైనది. బిల్వతిక్త రాజులలో కడపటి వాడను నైదవవిజయునికాలమున మహమ్మదీయులు స్వామిద్రోహులై తమకుపకారమొనర్చినరాజును తుదముట్టించిరి. అవసానకాలమునం దీరాజుదేశాంతరములనుండి మఱియొకజాతివా రేతెంచితురుష్కులపై పగదీర్చుకొందురని శపించెను. డచ్చివారు దాని కనుగుణ్యముగ నీదీవులలో మహమ్మదీయులను హతమార్చిరి. ఇంతటితో హిందూజావాచరిత్రమును, బిల్వతిక్తపుర సామ్రాజ్యచరిత్రమును ముగిసినవి.