పుట:Bharatiyanagarik018597mbp.pdf/75

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శతాబ్ది యుత్తరార్థమున శ్రీవిజయ రాజ్యము క్షీణించినది. 1277 లో జావాలో ప్రసిద్ధికెక్కిన సింగ నరిరాజులు సుమాత్రాలో చాలభాగమును జయించిరి. వారికి బిమ్మట రాజ్యమేలిన బిల్వొతిక్తపుర రాజులీద్వీపమును క్రమముగ స్వాధీనము జేసికొనిరి. ఈ జావా రాజులు సుమాత్రాద్వీపమును సంరక్షింపక, నయ్యది తిరిగి తలయెత్తి తమ కపాయమును గూర్చుననుభయమున దానిని వదిలివేసిరి. అంతట చైనాదేశీయు లనేకు లిటజేరి, వాణిజ్యనౌకలను కొల్లగొట్టుచు జీవించుచుండిరి. క్రీ. శ. 9-13 శతాబ్దములలో మహాకీర్తిని గడించి, సుభిక్షమగు భూమిగల యీ ద్వీపము క్రీ. శ. 14 వ శతాబ్దమున కేవలము నోడదొంగల కాశ్రయస్థానమై నశించినది.

బౌద్ద శిల్పకళాచరిత్రమున క్రీ శ్రీ విజయరాజ్య చరిత్రమెంతయు ముఖ్యమైనది. జావాద్వీపములోని కలస్సన్, బొరొబుదుర్ శిల్పములు భారతీయ శిల్పముల కెనయగునవి పండితుల యభిప్రాయము. ఈ శిల్పములను శైలేంద్రవంశీయులే నిర్మింపజేసిరి. స్థూపములను బోలు కట్టడములను భారతదేశమునుండి యీ రాజులే సూమాత్రాదీవిలోనికి దెచ్చి యటనుండి జావా, బోర్నియోలకు వ్యాపింపజేసిరి. అలంకార శిల్పమునందును, కట్టడముయొక్క బాహుళ్యతకు సరియగునటుల వివరములను నిర్మించుట యందును, బౌద్దవాఙ్మయమునకును, ఇతిహాసమునకును సరియగు ప్రతికృతులను శిల్పములను నిర్మించుటయందును, సూమాత్రాద్వీపవాసు లగ్రగణ్యులని కళాభిజ్ఞులు పొగడియున్నారు.