పుట:Bharatiyanagarik018597mbp.pdf/65

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


లమీదను రామాయణ మహాభారతములలోని భాగములలోని ఘట్టములు చెక్కబడియున్నవి. ద్రవిడదేశములోని కుంభకోణమునందలి చక్రపాణి దేవళమునను, మధురమీనాక్షి గుడిలోనుగూడ నిట్టివి గలవు. బలిద్వీపాలయములకు గోపురములున్నవి. జావాలోని 'డీఇన్గు' పీఠభూమి (Di-ing-plateau) లోనున్న పాండవుల గుడులు మైసూరు రాజ్యములోని పట్టడకల్, హాలేబీడు, ఐహోలు లందలి చాళుక్య దేవాలయములను, కాంచీవరములోని కైలాస నాధాలయమును బోలియున్నవి. 'చండీ జాగో, అను జావాదేవాలయమున విష్ణువర్థనుడను రాజు బుద్దునివలె శిల్పింపబడియున్నాడు. దీనిని మఱికొన్ని శిల్పాములను బరిశీలించి ప్రాచ్యకళాకోవిదుడగు ఫెర్గుసన్ పండితుడు "ఈదేవాలయమునుండి యవద్వీపము నందలి హిందూమతమునకును' దత్సంబంధములగు శిల్పములకును, భారతదేశమునందలి తెలింగాణమును, కృష్ణానదీముఖద్వారమును, మాతృకలని స్పష్టమగుచున్న" దని వ్రాసియున్నాడు. ఇట్టి శిల్పములు ప్రాంబనం, బెనన్ అనుచోట్లగూడ గలవు. ప్రాగ్భారతదేశమునందలి శిల్పములలోనెల్ల జావాలోని బొరొబుదుర్ దేవాలయ మగ్రగణ్యము ఒకకొండను దొలిచి, శిఖరమున నొక స్థూపమును' దానిచుట్టు నేడు - స్థూపవలయములను శిల్పి యిచట నిర్మించెను. విస్మయజనకమును వర్ణనాతీతమునగు నీయాలయమును బ్రశంసించుచు ఫెర్గుసన్ పండితుడు "శిల్పవైఖరినిబట్టి చూచినచో నీబ్ రొబుదుర్‌దేవాలయమును, హిందూదేశమునందలి అజాంతాగుహలనుగూడ నొకేశిల్పి నిర్మించెననియు, నీరెంటికినడుమ కాలవ్యత్యాసము విశేషముగ నుండియుండ"దనియు వ్రాసియున్నాడు. మఱికొన్ని విషయములలో నీయాలయము పల్లవులచే మహాబలిపురమున నిర్మింపబడిన దేవాలయములను బోలియున్నది. ఇచ్చటి యాలయపుటాకృతి కాశ్మీరమునను, మళయాళమునను శాక్తేయులు రచించు శ్రీచక్రమువలెనున్నది.


_______________