పుట:Bharatiyanagarik018597mbp.pdf/62

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


రాజునొద్దకు రాయబారి నంపెను. ఈ 'యాప్‌లన్‌' అనుపేరు 'మారన్‌' అను పేరుతో 'సంఘయుగమున' (Sangan Age) దక్షిణహిందూదేశము నేలిన పాండ్యరాజుల పేరును పోలియున్నది. ఇదేదేశపు రాజులు తాము కౌండిన్యుడను భారతీయ బ్రాహ్మణుని సంతతికి జెందినవారని దలచిరి. ఎలియట్ పండితు డీకౌండిన్యుడు మహాబలిపురమునుండి కాంబోడియా కేతెంచెనని వ్రాసియున్నాడు. యవద్వీపమున కళింగమునుండి వచ్చిన త్రిత్రేష్ఠుడను బ్రాహ్మణు డచ్చట హిందూమతమును స్థాపించెనని మఱియొక గాధ గలదు. ఇండోచైనాలో వారసత్వము స్త్రీలమూలముననే మలబారులోని మరుమక్కత్తాయమువలె సంక్రమించును. సుప్రసిద్ద ద్రవిడగ్రంథమగు 'మణిమేఖలై' లో యవద్వీపప్రశంస గలదు. అపుత్రుడను బ్రాహ్మణ యువకుడు యవద్వీపరాజపుత్రుడగ జన్మించి, దక్షిణదేశమున మణిపల్లవమనుచోట నివసించు మణిమేఖలై యనుభిక్షుణివలన ధర్మోపదేశమునంది, యాధర్మమును తనరాజ్యమున వ్యాపింపజేసెనట. మణిమేఖలయను పదమునకు జావాభాషలోను, సంఘయుగపు తమిళభాషలోనుగూడ సముద్రమని యర్దము.

(4) శాసనములు :- జావాద్వీపమునందలి శాసనములు మూలవర్మ, అశ్వవర్మ, జయవర్మమున్నగు దత్రస్థరాజన్యుల నామములను బేర్కొనుచున్నవి. వీనిలోని "వర్మ" శబ్దము దక్షిణహిందూదేశపు పల్లవ రాజుల నామములలో గన్పించుచున్నది మఱియు నీశాసనములలోని భాషయు లిపియుగూడ పల్లవశాసనములందలి భాషను, పల్లవగ్రంథ లిపిని బోలియున్నవి. ఉత్తరాపథమునందువలెగాక దక్షిణాపథమున బ్రాయికముగ శాలివాహనశకమే వాడుకలో నుండినది. ఈప్రాగ్భారతదేశ శాసనములందు నాశకమే వాడబడియున్నది. ఇండోచైనాలోనిభాగమగు లిగోర్ (Ligor) రాష్ట్రము, గోదావరీమండల నివాసియగు సంతకుమారుడను నాతనిచే స్థాపింపబడెనని మఱియొకశాసనము దెల్పుచున్నది. చంపారాజ్య

'