పుట:Bharatiyanagarik018597mbp.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యాడెను. వీరికి కుమారవిజయుడు బుట్టెను. పిమ్మట నా రాజపుత్రిక బౌద్దమతమునవలంబించి, కుమారవిజయుని విద్యాభ్యాసమునకై కాశ్మీర దేశమునకేగి, కొంతకాలమట నివసించెను. విద్యాభ్యాసము ముగిసినపిమ్మట గుమారవిజయుడు చైనాకు మరలివచ్చి క్రీ. శ. 401 నుండి బండ్రెండు సంవత్సరములకాలము మతప్రచారమొనర్చెను. ఈతడీకాలమున సూత్రాలంకారశాస్త్ర దశభూమువిభాసాశాస్త్ర, శతశాస్త్ర, సత్యసిద్దిశాస్త్రాది మహాయాన గ్రంథముల నెన్నిటినో భాషంతరీకరించి, వసుబంధు, నాగార్జు నాశ్వఘోషాది మహనీయులను చైనాదేశీయులకు సుపరిచితుల నొనర్చెను. (5) కోటానీయులు :- కోటాన్ అనుదేశము సాధారణముగ చైనాదేశీయులు భారతదేశమునుండి స్వదేశమునకు మరలునపు డనుసరించు దక్షిణ మార్గమునందున్నది. సంస్కృతవాఙ్మయమునం'దీదేశము 'కుష్టన' యని పేర్కొనబడియున్నది. హిందూదేశమునకు సమీపముగ నుండుటవలనను ఆఫ్‌గనిస్థానము నుండియు, కాశ్మీరమునుండియుగూడ నీదేశమునకు మార్గములుండుట వలనను, భారతీయులెందరో యిట నివసించుటయు, నీదేశపుభాషలో విశేషముగ సంస్కృతిపదములు గలియుటయు దటస్థించినవి. నాణెములనుండి యీదేశమునకు క్రీ. శ. 1 వ శతాబ్దిలోనే భారతీయసంపర్కము గల్గెనని తెలియుచున్నది. ఇచ్చట ఖరోష్ఠీలిపిలో వ్రాయబడిన ప్రాకృతలేఖలు దొరికినవి. క్రీ. శ. 259 లో ట్చౌషిహింగ్ (Tchou-she-hing) అను నొక చైనాదేశభిక్షు చైనాభాషలోనికి బరివర్తింపబడిన బౌద్దగ్రంథముల పట్టికను దయారుచేయుటకును, నూతనగ్రంథములను సమర్థులగు వారివద్ద నేర్చుటకునై కోటానుకువచ్చెను. క్రీ. శ. 291 లో మొక్సలుడను (Moksala) భిక్షు నిటనుండి చైనాకేగి పంచవింశతి సహస్రికప్రజ్ఞాపరిమిత, యను మహాయాన గ్రంథమును భాషాంతరీకరించెను. ఐదవ శతాబ్దిప్రారంభమున న్గన్‌యంగ్ (Ngan yang) అను నొక చైనారాజపుత్రుడు కోటానుకేగి, గోష్ఠుతి మహావిహారములో బుద్దసేనుడను భిక్షువువద్ద మహాయానమును