పుట:Bharatiyanagarik018597mbp.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భారతీయ నాగరికతా విస్తరణము.

5. చైనా దేశము.

ప్రాచీన సంబంధము

చైనాదేశము సంస్కృతవాఙ్మయమున 'శీనా^ యని పేర్కొన బడియున్నది. ఆదేశమునందలి భూస్వాములయొక్క 'మన్‌డరిన్‌' అను నామము సంస్కృతమునందలి 'మంత్రిన్‌' శబ్దభవము. క్రీ. పూ. 218 లో అశోకచక్రవర్తిచే బంపబడిన పదునెన్మండుగురు బౌద్దభిక్షువులు చైనాదేశపు రాజధాని కేగిరి. క్రీ. పూ. 2 వ శతాబ్దిలో చైనాదేశమున 'హ్యాన్‌' (Han) వంశము ప్రాముఖ్యతనందెను. ఈకాలమున చైనాకు పశ్చిమమున హూణులు, యూఎచీలునుండిరి. వీరివలన తనదేశమున కుపద్రవము గలుగకుండు నటులొనర్చుటకై 'వూ' యను హ్యాన్ చక్రవర్తియొక సేనానాయకుని బశ్చిమమున కంపెను. ఈతడు 12 సంవత్సరముల కాలము తిరిగి ఫేర్‌ఘానా, పార్థియా, బాక్ట్రియామున్నగు నెన్నియో దేశములను జూచి చక్రవర్తికి నివేదించెను. బాక్ట్రియాలోనుండగా నాతడు చైనాలోని దక్షిణభాగమునుండి బాక్ట్రియామీదుగను "సింధు" (హిందూ) దేశముమీదుగా ఆఫ్‌గనిస్థానమునకు వర్తక మార్గములుండుట గాంచెను. ఈవార్తను వినినపిమ్మట చైనాచక్రవర్తి హూణులను దఱిమి వారిదేశమును జయించి, దక్షిణమునుండి హిందూదేశమున కొకమార్గము నేర్పరుప బ్రయత్నించెను. క్రీ. శ. 73 లో చైనాదేశీయులు ఫెర్గానానుజయించి, కుచాయనుచోట నొక రాజప్రతినిధిని నెలకొల్పిరి. ఇందుమూలమున చైనానుండి ఇండియాకు పోవుమార్గము సురక్షితముగ నుండినది.