పుట:Bharatiyanagarik018597mbp.pdf/34

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


ఆసియాలోదొరికినవి. ఈగ్రంథములన్నియు సంస్కృతభాషలోనివే. ఇందు మూడురకముల లిపి గలదు. మొదటిది కుషాన్, గుప్తవంశీయుల కాలమునందుండిన పరిశుద్దమగు భారతీయ లిపి. అశ్వఘోషుని నాటకములును, కుమారలాతుని కల్పనామణ్డితికా యను గ్రంథము నీలిపిలో రచింపబడినవే. రెండవది ఏటవాలుగానుండు గుప్తలిపి, (Slanting Gupta Script) కుచ, టర్‌పన్ మున్నగుచోటుల దొరకిన గ్రంథము లీలిపిలోనివే మూడవది ఋజుగుప్తలిపి. (Upright Gupta Script) కోటాన్ దేశములోని సంస్కృతగ్రంథము లీలిపిలోనివి. ఈవివిధ లిపులలోనివై మధ్యఆసియాలో దొరికిన సంస్కృత లిఖితగ్రంథములలో నారుమాత్రము ముఖ్యములైనవి.

(1) అశ్వఘోషుని నాటకములు :- ఇంతవరకును మహాయాన బౌద్దమతమునకు మూలస్తంభముగనొప్పు నీమహా విద్వాంసుడు బుద్దచరిత్ర సుందరానందాది కావ్యములను, తత్త్వగ్రంథములను రచించెనని మనకు దెలియును. కాని యీమధ్య ఆసియాపరిశోధనల మూలమున నీత డొక గొప్పనాటక రచయిత యనువిషయము బయల్వెడలినది. ఈదొరికిన నాటకములలో "శాలిపుత్ర ప్రకరణ" మనునది మొదటిది. వినయపెటకము నందలి మహావగ్గమునుండి యిందలి కథాభాగము గైకొనబడినది. ఇందు బుద్దుడు, శాలిపుత్రుడు, మౌద్గలాయనుడు, కౌండిన్యుడు ననువారలు ముఖ్యపాత్రులు. రెండవనాటకము నైతికము. ప్రబోధచంద్రోదయము నందువలె దీనిలో బుద్ధి, దృతి, కీర్తి యనుపాత్రలు బౌద్దధర్మమును బోధించుచున్నవి. మూడవదానిలో మొదటినాటకములోని పాత్రలేగాక నొక యోగి, యొకబ్రాహ్మణుడు, నొక విదూషకుడునుగూడ గలరు. ఇందలి రంగములు మగధరాజ్య కేంద్రమగు రాజగృహములో స్థాపింపబడినవి. ఇందు పాత్రోచితముగ సంస్కృత ప్రాకృతభాషలు నుపయోగింప బడియున్నవి.