పుట:Bharatiyanagarik018597mbp.pdf/31

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


బండితులొనర్చిన పరిశ్రమను దానిఫలితమును సంగ్రహముగ బరీక్షింప వలసియున్నది. 1879 సంవత్సరమున రిగెల్ అనునొక జర్మనీదేశపువృక్ష శాస్త్రజ్ఞుడు మధ్యఆసియా కేగెను. అతని నివేదికలనుండి ఈభాగమున ప్రాచీనశిధిలములు లభించుననెడియాస బయల్వెడలినది. 1890 లో కల్నల్ బవర్ అనునత డిచ్చట భూర్జపత్రములపై లిఖింపబడిన యొక వైద్యగ్రంథమును సంపాదించెను. క్రీ. శ. 4 వ శతాబ్దమునాటి యీగ్రంథము దొరకుట తోడనే హైందవ విజ్ఞాన పరిశోధకులలో నూతనోత్సాహ ముదయించెను. క్రీ. శ. 1892 లో నొక ఫ్రెంచిదేశీయుడు గోశృంగవిహార మనుచోట ఖరోష్ఠి లిపిలో వ్రాయబడిన క్రీ. శ. 2 వ శతాబ్దినాటిదగు ప్రాకృతధర్మపదమును సంపాదించెను. క్రీ. శ. 1901 లో ఇండియా ప్రభుత్వమువారు సర్. అరల్ స్టెయిన్ అను నతనిని మధ్యఆసియాకు బంపిరి. ఈతడిచ్చట నమూల్యములగు శిధిలములను, చారిత్రక విషయములను గనిపెట్టి ప్రపంచమునకు క్రొత్తవింతల నెన్నిటినో దెలియజేసెను. క్రీ. శ. 1902 - 1906 ల నడుమ జర్మనులుగొందరు మధ్యఆసియాలో బరిశోధన మొనర్చి బౌద్దశిల్పములను సంస్కృత చైనా సిరియను సోగ్డియను భాషలలో లిఖింపబడిన గ్రంథములను గన్గొనిరి. క్రీ. శ. 1906 లో రెండవతూరి స్టెయిన్ యీప్రదేశమునకు యాత్రచేసి "వేయిమందిబుద్దులగుహ" (Grottos of the Thosand Buddhas) లని పిలువబడు బౌద్దవిహారములను, వానిలో క్రీ. శ. 11 వ శతాబ్దమునుండియు పదిలపరుపబడి యుండిన యొక బౌద్దగ్రంథాలయమును గనుగొనెను. ఇచ్చట గాంధారము నందలి కళనుబోలు శిల్పచిత్రలేఖనా కళలగూడ నుండినవి. పిమ్మట రష్యా, ఫ్రాన్సుదేశీయులుగూడ నీమధ్య ఆసియా బరిశోధనలలో బాల్గొనిరి. ఈపరిశోధనలనుండి యీప్రాంతమున భారతీయములగు బ్రాహ్మీఖరోష్టిలిపులును, ఒకతరగతి ప్రాకృతభాషయు, బౌద్దమతమును, వ్యాప్తిలో నుండెడివని స్పష్టమగుచున్నది.