పుట:Bharatiyanagarik018597mbp.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భాగము నిందు చేరియుండినవి. ఈవంశీయులలో కడపటివారికి - గజినీ సుల్తానులతో పోరాటము సంభవించినది. వీరిలో జయపాలుని పుత్రుడగు ఆనందపాలుడు వ్యాకరణశాస్త్రము నాదరించెను. శత్రువగు గజనీ మహమ్మదునెడ నీహిందూరాజు విశేషమగు దయనుజూపెనట. ఆనందపాలుని పుత్రుడగు త్రిలోచనపాలుడు తౌషీనదీతీరమున మహమ్మదుతో నొక ఘోర యుద్ధ మొనర్చెను. ఇందు విజయలక్ష్మి మహమ్మదీయులనే వరించెను. తళ్ళి కోటయుద్దానంతరము విజయనగరమువలె నీహిందూషాహియుల రాజధానియగు ఉదభాండపురము మహమ్మదీయులచే నాశమొనర్పబడెను. మిగిలినరాజ్యమంతయు వారికి సులభముగ వశమయ్యెను. ఇంతటితో ఆఫ్‌గనిస్థానమందలి భారతీయనాగరికతా విస్తరణచరిత్ర మంతమగు చున్నది.


________________