పుట:Bharatiyanagarik018597mbp.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మౌర్యయుగము :- అలెగ్జాండరు మరణించిన పిమ్మట నాతని సేనానులలో నొకడగు సెల్యూకస్ యవనరాజ్యమునందలి తూర్పుభాగమును స్వాధీనము జేసికొనెను. ఉత్తర హిందూదేశమునం దప్పుడే దలయెత్తిన చంద్రగుప్త మౌర్యుని ధాటి కాగలేక నీ యవన సేనాని పరోపనినది, అరియానా, అరకోసియా యను విభాగముల నాతని కొసంగి సంధి చేసికొనెను. ఈ మౌర్యులు బశ్చిమోత్తర ప్రాంతసంరక్షణార్థమై తక్షశిలానగరమునం దొక రాజ ప్రతినిదిని నియమించిరి. అప్పటినుండియు నా నగరమునుండి హైందవ నాగరికత బశ్చిమమునకు విస్తరించినది. అశోకచక్రవర్తి పరిసరములనుండు స్వతంత్రరాజ్యములకే గాక యవన, కాంభోజ, గాంధారదేశములలోని తన యేలుబడి క్రిందనుండిన భూభాగములకు గూడ బౌద్దభిక్షువుల నంపియు, ధర్మమహామాత్రులను నియమించియు, మతప్రచారమొనర్చెను. క్రీ. శ. 7 వ శతాబ్దమున భారతదేశము బర్యటన మొనర్చిన హ్యూన్‌ష్వాంగ్ అను చైనాయాత్రికుడు కపిశానగరరాజ్యమునం దశోకుడు స్థూపములను గట్టించెనని చెప్పియున్నాడు.

యవనరాజులు :- అశోకునిబిమ్మట శుభసేనుడను హిందూరాజు హిందూకుష్‌పర్వత ప్రాంతమును వశపఱచుకొనెను. తరువాత 'డెమిట్రియస్‌' అను యవనరాజు కాబూల్, అరకోషియా, పంజాబులను జయించెను, అటుపై యూక్రటైడిస్ అను నాతడు కపిశ గాంధార రాజ్యములనుగూడ జయించెను. ఈ యవనరాజులకాలమున హిందూదేశ నాగరికత ప్రబలినది. వీరు తమ నాణెములపై నామములను ప్రాకృతభాషలో బ్రాహ్మీ, ఖరోష్ఠీలిపులతో ముద్రించిరి. "కావిశియె నగర దేవతా" యను నొక నాణెముపై వ్రాతనుబట్టి యీకాలమున సుదూరమునందుండిన కపిశానగరమున బ్రాకృతభాష వ్యాప్తిలో వుండెనని తెలియుచున్నది.